భారత మార్కెట్లో తమ ఉనికి చాటుకుని, వ్యాపారాన్ని మరింత పెంచుకోవాలని దక్షిణ కొరియా కార్ల కంపెనీ హ్యుందయ్ యత్నిస్తోంది. ఈ మేరకు ఎంట్రీ లెవల్లో ఆకట్టుకునే ఫీచర్లతో స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ)ని తీసుకొస్తున్నట్టు ఆ సంస్థ సీఈవో అన్సూ కిమ్ చెప్పారు. భారత్‌లో ఎస్‌యూవీల కొనుగోలు పెరిగిందని, చాలామంది వాటిపై మోజుపడుతున్నారని అన్నారు. ఇది గమనించి తాము కొత్త మోడల్ కారును లాంచ్ చేసినట్టు వెల్లడించారు.
– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
దక్షిణ కొరియా కార్ల కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ ఇవ్వాల (సోమవారం) దేశంలో ఓ సరికొత్త మోడల్ కారును లాంచ్ చేసింది. కొత్తగా కారు కొనేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, చిన్న స్పోర్ట్-యుటిలిటీ వెహికల్ (SUV) రోడ్లపై దూసుకెళ్లుందని ఆ సంస్థ సీఈవో కిమ్ చెప్పారు. ఇతర కంపెనీలు కొత్త కొత్త మోడల్స్‌తో మార్కెట్లో దూసుకెళ్తుంటే.. హ్యుందయ్ కూడా మార్కెట్లో తమ వాటాను పోగొట్టుకోకుండా ఈ ఎస్‌యూవీని అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. దేశీయ ప్రత్యర్థి టాటా మోటార్స్ పంచ్ SUVకి దీటుగా ఎక్స్ టర్ SUV ఎంట్రీ-లెవల్ మోడల్‌కు ₹ 5.99 లక్షలు ($7,300) నుండి టాప్-ఎండ్ వేరియంట్‌కి ₹ 9.99 లక్షల వరకు ఉంటుంది.
ఈ వాహనం ఎంట్రీ-లెవల్ SUV సెగ్మెంట్లో హ్యుందాయ్‌కు ఇప్పటిదాకా ఉన్న వ్యాక్యూమ్‌ని బర్తీ చేయనున్నట్టు కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక.. Exter లాంచ్‌తో హ్యుందాయ్ మోటార్ ఇండియా పూర్తి స్థాయి SUV తయారీదారుగా అవతరించింది. ఈ కారును డెవలప్ చేయడానికి 9.5 బిలియన్ రూపాయలను వెచ్చించామని కిమ్ తెలిపారు. తమ అనుబంధ సంస్థ కియా కార్ప్ తో విక్రయాల ద్వారా ప్రపంచంలోని మూడవ అతిపెద్ద వాహన తయారీ సంస్థగా ఉన్నామని వెల్లడించారు.
ఇక.. ఎక్స్ టర్లో వాయిస్-ఎనేబుల్డ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, సెల్ఫీలు తీసుకోవడానికి డ్యాష్‌బోర్డ్ కెమెరా, పెద్ద కార్ మోడళ్లలో తరచుగా కనిపించే వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. హ్యుందాయ్ ఇటీవలి సంవత్సరాలలో అల్కాజార్, క్రెటా వంటి పెద్ద.. మధ్య-పరిమాణ SUVలను విడుదల చేసింది. భారతదేశంలో కార్ల కొనుగోలుదారులు SUVల వైపు మొగ్గు చూపుతున్నారు. కొవిడ్ అనంతరం కార్ల కొనుగోలు బాగా పెరిగింది. వీటి అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కాగా, హ్యుందాయ్ ప్రత్యర్థి మారుతీ సుజుకి గత వారం ప్రీమియం సెవెన్-సీటర్‌ను విడుదల చేసింది. కారు లవర్స్‌ని ఆకట్టుకునే యత్నాలు చేస్తోంది.