Thursday, November 21, 2024

Floods: ఉప్పొంగిన మూసీ నది.. హైదరాబాద్​లో రెండు బ్రిడ్జిలపై రాకపోకలు బంద్​

హైదరాబాద్‌లోని మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. సిటీలో ఉన్న రెండు బ్రిడ్జిలపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు ఛాదర్​ఘాట్​పాత వంతెనతోపాటు, మూసారాంబాగ్​ కాజ్​వేని బుధవారం క్లోజ్​ చేసి, రాకపోకలు నిలిపివేశారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడం, శివార్లలోని జంట జలాశయాల నుండి నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల మూసీ ఉప్పొంగుతోంది. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు మూసారాంబాగ్ కాజ్‌వే, చాదర్‌ఘాట్ పాత వంతెనను మూసివేశారు.

ఈ వంతెనలకు ఇరువైపులా ట్రాఫిక్‌ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో చాదర్‌ఘాట్‌, మలక్‌పేట, మూసారాంబాగ్‌ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. అంబర్‌పేట-మలక్‌పేట మధ్య ట్రాఫిక్‌ నిలిచిపోగా.. చాదర్‌ఘాట్‌-మలక్‌పేట మధ్య వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాధారణ సమయాల్లోనే రద్దీగా ఉండే ఈ వంతెనల వద్ద నది ప్రవాహం పెరగడంతో పూర్తిగా జలమయం అయ్యాయి.

నదీ తీరాలకు సమీపంలోని నివాస ప్రాంతాలు కూడా ముంపునకు గురవుతున్నాయి. అలర్ట్​ అయిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారులు వరద బాధితులను సహాయక శిబిరాలకు తరలించారు. ఎగువన, పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంగళవారం నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది.

ఇక.. వికారాబాద్‌, చేవెళ్లలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జంట జలాశయాలైన ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌లకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఉస్మాన్ సాగర్ (గండిపేట)లో ఇన్ ఫ్లో 8 వేల క్యూసెక్కులకు పెరిగింది. మూసీ నదిలో 8,281 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ అండ్‌ ఎస్‌బీ) ఆరు అడుగుల వరకు 13 గేట్లను తెరిచింది. గండిపేటలో ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్) 1,790 అడుగులకు గాను బుధవారం ఉదయం 1,789.10 అడుగులుగా ఉంది.

హిమాయత్ సాగర్‌కు కూడా 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. నదిలోకి 10,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఎనిమిది గేట్లను తెరిచారు. ఈ రిజర్వాయర్‌లో నీటిమట్టం 1763.50 అడుగులకు గాను 1762.70 అడుగులకు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement