Thursday, November 21, 2024

తెలంగాణలో పెరిగిన కేసులు.. గాంధీలో ఏర్పాట్లు

తెలంగాణలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వైరస్‌ సెకవండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోంది. రోజు వారీ కేసుల పెరుగుదలతో పాటు మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో కొత్త‌గా 2,055 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క‌రోజులో కరోనాతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రెండో దశలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో అందుకు తగ్గ సౌకర్యాలు ఏర్పాటు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే 300 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేశారు. తాజాగా మరో 200 ఆక్సీజన్​ బెడ్లను సిద్ధం చేస్తున్నారు.

కరోనా రెండో దశ మొదలవగానే 200 ఐసీయూ పడకలను ప్రధాన భవనంలోని రెండో అంతస్తులో ఏర్పాటు చేశారు. కేసుల సంఖ్య ఇంకా పెరుగుతుండడంతో మరో వంద పడకలను మూడో అంతస్తులో సమకూర్చారు. ప్రస్తుతం కరోనా అత్యవసర బాధితులనే చేర్చుకుంటున్నారు. ఇకపై వచ్చేవారి కోసం ఆక్సిజన్‌, వెంటిలేటర్లు అమర్చే పడకల ఏర్పాటుకు ఉపక్రమించారు. ఇప్పటివరకు ఉన్న 300 పడకలన్నీ వెంటిలేటర్ల సౌకర్యమున్నవే ఉన్నాయి. వాటిల్లోనే ఆక్సిజన్‌ అవసరమయ్యే రోగులనూ ఉంచి వైద్యాన్ని అందిస్తున్నారు. ఇటీవల పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకొని ఆక్సిజన్‌ను మాత్రమే అందించేలా తాజాగా 200 బెడ్లను ఏర్పాటు చేస్తున్నారు.

మరోవైపు తెలంగాణలో లాక్‌ డౌన్‌, కర్ఫ్యూ విధించేందుకు ఆస్కారం లేదని, ఉండబోదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. కేసులు పెరుగుతున్నా ఎక్కువ మందిలో లక్షణాలు లేవని తెలిపారు. మరణాల రేటు కూడా తక్కువగానే ఉందన్నారు. గతంలో 85 శాతం మంది బాధితుల్లో లక్షణాలు లేకుండా ఉంటే.. ప్రస్తుతం 95 శాతం మందిలో లక్షణాలు కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం ర్యాపిడ్‌ టెస్టులతో వెంటనే ఫలితం తెలుస్తోందని ఈటల అన్నారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి వెంటనే కరోనా కిట్‌ ఇస్తున్నట్లు చెప్పారు. రిపోర్టు వెంటనే రావడం వల్ల కాంటాక్టు ట్రేసింగ్‌ కూడా సులభం అవుతోందని అన్నారు. టెస్టులను అవసరమైతే లక్ష వరకు పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. గతంలో ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేసిన తర్వాత రిపోర్టు రావడానికి చాలా సమయం పట్టేదన్నారు. ప్రస్తుతం గ్రామాల్లోని పీహెచ్‌సీల వరకు ర్యాపిడ్‌ టెస్టులు అందుబాటులో ఉన్నందున ఫలితం వెంటనే తెలిసిపోతుందని చెప్పారు.

రాష్ట్రంలోని పీహెచ్‌సీల నుంచి రాష్ట్ర స్థాయి ఆస్పత్రుల వరకు రోజువారీ ఓపీ సేవలను కొసాగిస్తూనే కొవిడ్‌ సర్వీసెస్‌ కూడా అందిస్తున్నట్లు తెలిపారు.  వైద్యారోగ్య శాఖ పరిధిలోని సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పరిస్థితి విషమంగా ఉన్న బాధితులను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న జిల్లాల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. 22 ఆస్పత్రుల్లో పెద్ద మొత్తంలో ఆక్సిజన్‌ సిలిండర్లు, 11 వేల ఆక్సిజన్‌ బెడ్లు, ఐసీయూల సంఖ్యను పెంచినట్లు వివరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని ఏర్పాట్లతో సర్వసన్నద్ధంగా ఉన్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు కూడా వ్యాపార కోణంలో కాకుండా మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రజలకు ధైర్యం కల్పించి ఆదుకోవాలని మంత్రి ఈటల కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement