Monday, November 25, 2024

హైద‌రాబాద్ టూ ముంబై… బుల్లెట్ ట్రైన్ ఎక్కెద్దామా మ‌రి..

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్ : దేశ వాణిజ్య రాజధాని ముంబై నుంచి చారిత్రక భాగ్యనగరికి హైస్పీడ్‌ రైలు అందుబాటులోకి రానుంది. రెండు నగరాల ప్రజలు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఎస్‌ఆర్‌) కార్యాచరణ చేపట్టింది. మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 650 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఎలివేటెడ్‌ వయాడక్ట్‌, టన్నెల్‌ కారిడార్‌ కోసం హెచ్‌ఎస్‌ఆర్‌ తాజాగా భూసేకరణ పనులను చేపట్టింది. థానె, నవీ ముంబై, లోనావాలా, పూణ, బారామతి, పండరీపూర్‌, షోలాపూర్‌, గుల్బర్గా, వికారాబాద్‌ల మీదుగా ఈ రైలు పరుగులు పెట్టనుంది. రెండు ప్రధాన నగరాల మధ్య రోడ్డు మార్గంలో వాహనాల రద్దీని, కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకునేలా బుల్లెట్‌ రైలు అందుబాటులోకి రానుంది.

ప్రస్తుతం హైదరాబాద్‌ – ముంబై మధ్య విమానాలు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రోడ్డు మార్గం నుంచి కూడా పెద్ద ఎత్తున రాకపోకలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి ముంబైకి 617 కిలోమీటర్ల విమానయానానికి కేవలం గంటన్నర సమయం పడుతోంది. ముంబై – హైదరాబాద్‌ మధ్య 773 కిలోటర్లు ఉన్న రైలు మార్గంలో 14 గంటల 20 నిమిషాల సమయం పడుతోంది. రోడ్డు మార్గం 710 కిలోమీటర్ల వరకు ఉంటుంది. బస్సులు, కార్లు తదితర వాహనాల్లో చేరుకునేందుకు 13 గంటల 15 నిమిషాల సమయం పడుతోంది.

ప్రస్తుతం నిర్మించతలపెట్టిన 650 కిలోమీటర్ల హై స్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ద్వారా గంటకు 330 కిలోమీటర్ల చొప్పున కేవలం 3 గంటల్లోనే ముంబై నుంచి హైదరాబాద్‌కు చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఆయా రాష్ట్రాలలో ఉన్న పలు కారణాల వల్ల భూసేకరణ కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే వీలైనంత తొందరగా భూసేకరణ పూర్తి చేసేందుకు వీలవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement