హైదరాబాద్ సిటీలో ర్యాష్ డ్రైవింగ్ చేసిన అయిదుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టుచేశారు. శనివారం రాత్రి ఐఎస్ సదన్ వద్ద ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసినందుకు సంతోష్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 336, 279, 290, 510 r/w 34, మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 184 కింద బుక్ చేసిన కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. అందులో ఇద్దరు పరారీలో ఉన్నారు.
సౌత్ జోన్ డిసిపి పి సాయి చైతన్య మాట్లాడుతూ.. శనివారం రాత్రి 12.30 గంటల ప్రాంతంలో పోలీసు పెట్రోలింగ్ కారులో రిజిస్ట్రేషన్ నంబర్ లేని విల్లీజ్ జీప్‌ను నడుపుతున్న వ్యక్తిని గుర్తించామని, రెండు మోటార్‌సైకిళ్లపై మరికొందరు యువకులు దానిని అనుసరిస్తూ ప్రధాన రహదారిపై విన్యాసాలు చేస్తూ పట్టుబడ్డారన్నారు. ప్రజల జీవితానికి, వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించడం.. అపాయకరంగా డ్రైవింగ్ చేసినందుకు వారిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
పోలీసు అధికారులు వారిని పట్టుకోవడానికి యత్నించారు. కానీ, వారిని చూడగానే అక్కడి నుండి పారిపోయారు. బైకర్లు, జీప్ డ్రైవర్ల విన్యాసాలు.. రేసింగ్‌లను చూసి ప్రజలు.. ఆ రూట్లో వెళ్లే వారు భయాందోళనకు గురయ్యారని డిసిపి చెప్పారు.
రూల్స్ అతిక్రమించిన సయ్యద్ సహిలుద్దీన్ అలియాస్ సయ్యద్ సౌత్ (20), సంతోష్‌నగర్, మొహమ్మద్. ఈడీ బజార్ నివాసి రిజ్వాన్ (19), హఫీజ్ బాబా నగర్ నివాసి మొహమ్మద్ సోహైల్ (20)లను అరెస్టు చేసినట్టు తెలిపారు. చాంద్రాయణగుట్ట నివాసి షేక్ అమ్మద్-బిన్-అబ్దుల్-రహమాన్-అల్-అమోది అలియాస్ అమోది (19), కర్ణాటకకు చెందిన మహ్మద్ యూసుఫ్ (19) పరారీలో ఉన్నారు. జీప్ విల్లీజ్, పల్సర్ బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.