Tuesday, November 26, 2024

ఐపీఎల్ లో సన్ రైజర్స్ ఊరట.. రాజస్థాన్ ఆశలపై నీళ్లు

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు ఓ ఊరట విజయం లభించింది. రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఐదు ఓటముల తర్వాత తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 165 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. జేసన్ రాయ్ 60 (42 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్), కెప్టెన్ కేన్ విలియమ్సన్ 51 (41 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్) పరుగులతో చెలరేగడంతో రాజస్థాన్ ఓటమిపాలైంది.

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ఉతుకుడుతో భారీ స్కోరు చేసింది. 57 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శాంసన్ 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. జైస్వాల్ 36, లోమ్రోర్ 29 పరుగులు చేయడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో కౌల్ రెండు వికెట్లు పడగొట్టగా, సందీప్ శర్మ, భువనేశ్వర్, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు. 60 పరుగులు చేసి హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించిన జేసన్ రాయ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసుకు దూరమైన హైదరాబాద్‌కు ఇది ఊరట విజయం కాగా,  ప్లే ఆఫ్స్‌పై ఆశలు పెట్టుకున్న రాజస్థాన్‌కు ఈ ఓటమితో గట్టి దెబ్బ తగిలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement