హైదరాబాద్‌లో ఎన్ని ఫుడ్స్ ఉన్నా హలీంకు ఉన్న క్రేజే వేరు. రంజాన్ వస్తుందంటే చాలు నగరంలో ఏ గల్లీ చూసినా హలీం ఘుమఘుమలే వస్తాయి. నగరవాసులు కూడా రంజాన్ నెలంతా దొరికే హలీంను లొట్టలేసుకుంటూ తింటారు. మరో 10 రోజుల్లో రంజాన్ మాసం ఆరంభం కాబోతుంది. ఈ మేరకు ముస్లింలతో పాటు హైదరాబాద్ వాసులంతా హలీం తినేందుకు క్యూ కడతారు. అయితే గత ఏడాది కరోనా లాక్‌డౌన్ కారణంగా రెస్టారెంట్లు మూసి ఉండటంతో హలీం ప్రియులు హలీంను తెగ మిస్ అయ్యారు. దీంతో ఈ సీజన్‌లో హలీం అమ్మకాలను ఎక్కువ సంఖ్యలో విక్రయించాలని హలీం మేకర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. అయితే మునుపటి కంటే హలీం ధర ఎక్కువగా ఉండనట్లు తెలుస్తోంది. ఎందుకంటే సెకండ్ వేవ్ కారణంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్-19 ప్రోటోకాల్స్ పాటించేలా చూసేందుకు రెస్టారెంట్లు అదనపు ఖర్చులు భరించాల్సిన పరిస్థితి ఉండటమే.
దీనిపై హలీం మేకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఏ మజీద్ మాట్లాడారు. ఈసారి హలీం విక్రయించే అన్ని రెస్టారెంట్ల వద్ద కోవిడ్-19 ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. పిస్తాహౌజ్ వద్ద హలీం ప్రొడక్షన్ ప్రారంభానికి 8 రోజుల ముందే సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచుతున్నామని, సిబ్బంది పని ప్రారంభించే ముందు కరోనా టెస్టులు నిర్వహిస్తామన్నారు. బయట వ్యక్తులతో సిబ్బంది ఇంటరాక్ట్ కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో మునుపటి కంటే రెస్టారెంట్ల ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉందన్నారు. 2019లో రూ.190కి విక్రయించిన ప్లేట్ హలీంను ఈసారి రూ.220కి విక్రయించాలని పిస్తా హౌజ్ భావిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే హలీం సర్వింగ్‌ను ప్రారంభించిన కేఫ్ 555 వంటి కొన్ని రెస్టారెంట్లు ప్లేట్ హలీంను రూ.200కి విక్రయిస్తున్నాయని వెల్లడించారు. ఈ ఏడాది హలీం తయారీకి ఉపయోగించే పదార్థాల ధరలు కూడా పెరగడంతో తాము హలీం ధరలు పెంచక తప్పడం లేదని మజీద్ తెలిపారు.