సురక్షితమైన పర్యావరణంలో విద్యార్థులు తమ చదువు కొనసాగించాలని, మరింత బాధ్యతాయుతమైన పౌరులుగా అభివృద్ధి చెందడానికి కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆంనద్ అన్నారు. అటువంటి వాతావరణాన్ని నిర్మించడానికి యాంటీ డ్రగ్ కమిటీ(ADC)లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మాదకద్రవ్యాల వ్యాపారం, యువతను చెడు దారి పట్టించకుండా రాష్ట్ర ప్రభుత్వం, నగర పోలీసులు తీసుకుంటున్న చర్యలను ఇవ్వాల (సోమవారం) తెలియజేశారు.
హైదరాబాద్లోని అన్ని కాలేజీలు, విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలని హైదరాబాద్ సిటీ పోలీసులు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు, యువతకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కళాశాలలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీలో తప్పనిసరిగా అధ్యాపకులు, విద్యార్థుల నుంచి ఐదుగురు సభ్యులు ఉంటారని తెలిపారు. ప్రధానంగా మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఈ కమిటీ పని చేస్తుందన్నారు.
మాదకద్రవ్యాల వైపు విద్యార్థులు మొగ్గు చూపకుండా, వివిధ పరిస్థితులను ఎదుర్కోవటానికి మానసికంగా సిద్ధం చేయడానికి ఈ కమిటీ పనిచేస్తుందని సీపీ చెప్పారు. మాదకద్రవ్యాల విషయంలో తోటివారి ఒత్తిడిని నిరోధించేందుకు అవసరమైన నైపుణ్యాలతో యువతకు శిక్షణ ఇవ్వడం చాలా అవసరం అన్నారు. గత రెండేళ్లలో కొవిడ్ మహమ్మారితో విద్యాకు అంతరాయం కలిగిందని, ఆ తర్వాత కళాశాలలు సాధారణ స్థితికి చేరుకున్నందున, యువకులను మరింత జాగృతం చేయడంతో పాటు, పోలీసులు చట్టపరమైన చర్యలను చేపట్టారు. దీంతో హైదరాబాద్ సిటీలో విద్యార్థుల్లో చైతన్యం తేవడం ద్వారా మాదకద్రవ్యాల వ్యాపారాన్ని అరికట్టే చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ పోలీసులు రూపొందించిన మార్గదర్శక సూత్రాల ప్రకారం పనిచేసే ఈ ఏడీసీలు (యాంటీ డ్రగ్ కమిటీలు) తమ క్యాంపస్‌లలో వివిధ డిజిటల్ ప్రచారాలు, వర్క్ షాప్‌లు, సెమినార్‌ల ద్వారా మాదకద్రవ్యాల దుర్వినియోగం, ప్రమాదాల గురించి అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. ఒక కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు, విద్యా సంవత్సరం ప్రారంభంలోనే మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే ప్రమాదాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి, తల్లిదండ్రులు, సిబ్బంది, విద్యార్థులు, ఏజెన్సీల మధ్య సహకార విధానాన్ని నిర్ధారించడానికి సంస్థ అధిపతి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.