Tuesday, November 26, 2024

Hyderabad: ఆన్​లైన్​ ట్రేడింగ్​ పేరిట భారీ మోసం.. దేశంలోనే అతిపెద్ద సైబర్​ క్రైమ్​ని ఛేదించిన పోలీసులు!

దేశంలోనే అతిపెద్ద మోసాన్ని సైబరాబాద్​ పోలీసులు ఛేదించారు. ఆన్​లైన్​ ట్రేడింగ్​ పేరిట కోట్లలో డబ్బు కొల్లగొడుతున్న ముఠాని పట్టుకున్నారు. ఈ క్రమంలో దాదాపు 10 కోట్ల రూపాయలను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. దేశంలోనే ఇంత పెద్ద సైబర్​ మోసాన్ని గుర్తించి, 10కోట్లు స్వాధీనం చేసుకోవడం ఇదే ఫస్ట్​ టైమ్​ అని సైబరాబాద్​ పోలీస్​ కమిషనర్​ స్టీఫెన్​ రవీంద్ర చెబుతున్నారు. దీనికంతటికీ ఉత్తరప్రదేశ్​, రాజస్థాన్​ నుంచి వచ్చిన మోసగాళ్ల పనేనని చెప్పారు.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

సైబరాబాద్ పోలీసులు అంతర్ రాష్ట్ర సైబర్ మోసగాళ్ల ముఠా గుట్టు రట్టు చేశారు. వారి నుంచి సుమారు 10 కోట్ల  రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇది దేశంలోని సైబర్ క్రైమ్ కేసులో అతిపెద్ద రికవరీగా అధికారులు చెబుతున్నారు. మార్కెట్ బాక్స్ ట్రేడింగ్ అప్లికేషన్ ద్వారా ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో అమాయకులను టార్గెట్​ చేసుకున్న నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.9.81 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సోమవారం తెలిపారు. అయితే.. దీనిపై  ఫిర్యాదు చేసిన వ్యక్తిని మోసగాళ్లు రూ.27.90 లక్షల మేర మోసం చేశారని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారు ‘మార్కెట్ బాక్స్’ ట్రేడింగ్ అప్లికేషన్‌పై ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్రారంభించాడు. ప్రారంభంలో అతను సుమారు రూ. 9,999 పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని కోల్పోయాడు. తర్వాత మళ్లీ మరో 10 లక్షల రూపాయల దాకా డిపాజిట్ చేసి, వ్యాపారం చేసి 14.9 లక్షలు లాభం  పొందాడు. అదేవిధంగా ట్రేడింగ్‌ను కొనసాగించి దాదాపు రూ.62.6 లక్షలు పెట్టుబడి పెట్టాడు. దీంతో రూ.34.7 లక్షలు అందుకున్నాడు. ఈ క్రమంలోనే మరో రూ.27.90 లక్షలు పోగొట్టుకున్నాడు. అయితే ఇదంతా మోసమని గ్రహించిన బాధితుడు సైబరాబాద్​ పోలీసులను ఆశ్రయించాడు.

దీంతో పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 419, 420, IT చట్టంలోని సెక్షన్ 66C, 66D కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన కమోడిటీ వ్యాపారి అభిషేక్ జైన్ (32)ను పోలీసులు అరెస్టు చేశారు. మార్కెట్ బాక్స్ ట్రేడింగ్ యాప్‌ను ఆపరేట్ చేసిన విషయంలో ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. రాజస్థాన్ నివాసితులు, ఫిన్‌టెక్ వ్యాపారంలో ఉన్న పవన్ కుమార్ ప్రజాపత్, ఆకాష్ రాయ్ ఇతనికి బ్యాంకు ఖాతాలను అందించినట్టు ఎంక్వైరీలో తేలింది.

- Advertisement -

ప్రధాన నిందితుడు అయిన అభిషేక్​ జైన్​సహచరుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రీకృష్ణకుమార్‌ హవాలా వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. రెండు, మూడో నిందితులను జోధ్‌పూర్‌లో అరెస్టు చేశారు. వారి నుంచి ఆధారాలతో కూడిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారు చెప్పిన సమాచారం ఆధారంగా ప్రధాన నిందితుడిని, అతని సహచరుడిని ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లా మొఘల్‌సరాయ్ పట్టణంలో అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడి కార్యాలయంలో రూ.9.8 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

అయితే.. ప్రధాన నిందితుడు అయిన అభిషేక్ జైన్ కూడా మొదట ట్రేడింగ్‌లో డబ్బును పోగొట్టుకున్నాడు. మోసపూరిత వ్యాపార దరఖాస్తుల ద్వారా వ్యాపారుల నుండి డబ్బు వసూలు చేయొచ్చని అతను పథకం పన్నాడు. వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు పొందేందుకు 10 శాతం కమీషన్‌తో ప్రధాన నిందితులకు పవన్‌కుమార్‌ బ్యాంకు ఖాతాలు అందించాడు. ఇక.. ఆకాష్ రాయ్ వారణాసి, ఆ సమీప ప్రాంతాల నుండి వ్యాపారుల బ్యాంకు ఖాతాలకు నగదుగా మార్చడం కోసం నిధులను బదిలీ చేయడంలో చురుకుగా పాల్గొన్నాడు. ప్రధాన నిందితుడి ఆదేశాల మేరకు శ్రీకృష్ణ కుమార్, మొగల్‌సరాయ్, వారణాసిలోని వ్యాపారుల నుంచి కమీషన్ కోసం నగదు వసూలు చేసే పనిలో పడ్డారు.

కాగా, ప్రధాన నిందితుడు ట్రేడింగ్ అప్లికేషన్‌ను డెవలప్ చేశాడు. ‘మార్కెట్ బాక్స్/ఎంబి’ www.marketbox.in, దీన్ని వివిధ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులలో ప్రచారం చేశారు. ఈ అప్లికేషన్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) మాదిరిగానే ఉంటుంది కానీ SEBIలో నమోదు కాలేదు. ఈ నకిలీ యాప్‌లో దాదాపు 3 వేల మంది వ్యాపారులు నమోదయ్యారని పోలీసు కమిషనర్ తెలిపారు. ప్రధాన నిందితుడు తన ట్రేడింగ్ యాప్‌ను వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో వివిధ చాట్ గ్రూప్‌లలో ప్రచారం చేయడం ద్వారా కస్టమర్లను ఆకర్షించాడు.

బాధితుల నుండి పెట్టుబడులను స్వీకరించడానికి అతను జోధ్‌పూర్‌కు చెందిన ఫిన్‌టెక్ కంపెనీ నిర్వహిస్తున్న పవన్ కుమార్ ప్రజాపత్‌కు చెందిన మర్చంట్ పూల్ ఖాతాను (MPA) ఉపయోగించుకున్నాడు. ఈ MPA మార్కెట్ బాక్స్ యొక్క API (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్) ద్వారా మార్కెట్ బాక్స్ కి లింక్ చేశారు. బాధితుడి నుండి పెట్టుబడి లేదా చెల్లింపు తర్వాత, బాధితుడు వ్యాపారం చేసే మార్కెట్ బాక్స్ IDలో అతని బ్యాలెన్స్ కు వ్యతిరేకంగా ఇది ప్రతిబింబిస్తుంది. బాధితుల నుంచి వచ్చిన పెట్టుబడులను పలు ఖాతాల ద్వారా మళ్లించి మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement