హైదరాబాద్ నగరాన్ని గత మూడు రోజులుగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మాములుగానే హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు ఉంటాయి. ఇక వర్షం పడిందంటే రోడ్లపైనే గంటల తరబడి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటన చేసింది. మెట్రో రైలు సేవలను ఈనెల 6 నుంచి మరో అరగంట పొడిగించనున్నట్లు తెలిపింది.
గతంలో మాదిరిగానే ఉదయం 7 గంటల నుంచి మెట్రో సేవలు ప్రారంభమవుతాయి. రాత్రి 10:45 గంటలకు ముగుస్తాయి. ప్రతిరోజు మూడు మార్గాల్లో 1,000 ట్రిప్పులను మెట్రో తిప్పుతోంది. మెట్రో రైలుతో నగర ప్రజలు ట్రాఫిక్ నుంచి కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. ఉదయం కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లేందుకు ఎక్కువగా నగర ప్రజలు మెట్రో సేవలనే వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సేవల పొడిగింపుతో నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొన్నిరోజుల పాటు కరోనా ఉధృతి నేపథ్యంలో మెట్రో సేవలు నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అన్ని కారిడార్లలో మెట్రోరైళ్లను పూర్తి స్థాయిలో నడుపుతున్నారు.