తెలంగాణ ప్రభుత్వం నిమ్స్ డెవలప్మెంట్ కోసం 1571 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇవ్వాల (బుధవారం) దీనికి సంబంధించిన పరిపాలనా అనుమతులకు ఆమోదం తెలిపింది. హైదరాబాద్ పంజాగుట్టలోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అభివృద్ధికి బుధవారం 1571 కోట్లు మంజూరు చేసినట్టు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSSHCL)కి చెందిన నోడల్ ఏజెన్సీ అయిన SBI CAP (క్యాపిటల్ మార్కెట్స్)తో పాటు, విస్తరణ ప్రాజెక్ట్ ఖర్చులను కవర్ చేయడానికి బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుండి నిధులను సేకరించడానికి NIMS నిర్వహణకు అనుమతి ఇచ్చారు ..
ఈమేరకు తెలంగాణ ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ ఇవ్వాల ప్రభుత్వ ఉత్తర్వులు (GO Ms No 142) జారీ చేశారు. ‘ఆరోగ్య తెలంగాణ’ దిశగా ఇది మరో పెద్ద ముందడుగు అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దీనికి సంబంధించి ఓ ట్వీట్లో పూర్తి వివరాలు హరీశ్‌రావు వెల్లడించారు. “#ArogyaTelangana దిశగా మరో పెద్ద అడుగులో, “NIMS విస్తరణ ప్రాజెక్ట్” కోసం ప్రభుత్వం ₹1,571 కోట్లను మంజూరు చేసింది. సీఎం శ్రీ కేసీఆర్ గారి దార్శనికతతో కూడిన తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, ఆరోగ్య సంరక్షణను పటిష్టం చేయడమే ప్రధానమని మంత్రి హరీశ్ ట్వీట్ చేశారు. నిన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఎనిమిది జిల్లాల్లో కొత్తగా నిర్మించిన 8 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అకడమిక్ సెషన్‌ను లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.