పండుగల సీజన్లో ఉండే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలు ఆలస్యం కాకుండా చూసుకోవాలని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (RGIA) అధికారులు కోరారు. ఈ మేరకు ఇవ్వాల (శనివారం) ట్రాఫిక్ అడ్వైజరీకి సంబంధించిన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. హైదరాబాద్ నుండి ఎయిర్‌పోర్టుకు వచ్చే వారు చాలా ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని RGIA అధికారులు కోరారు.
విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులు తమ జర్నీని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ఆర్జీఐఏ అధికారులు అభ్యర్థించారు. విమానాశ్రయం నుండి హైదరాబాద్ సిటీకి రవాణా సౌకర్యాల కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. అంతేకాకుండా ప్రయాణికులు విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న బహుళ రవాణా మార్గాలను ఉపయోగించుకోవచ్చన్నారు.
ఇక.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఇటీవల శిల్పారామం నుండి RGIA వరకు బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఈ బస్సులు ఉదయం 4:30 నుండి రాత్రి 10:30 వరకు అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజూ, వారానికి ఏడు రోజులు, ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. రోజువారీ ప్రయాణికులకు 10శాతం తగ్గింపు లభిస్తుందని అధికారులు తెలిపారు.