అమ్మాయిలను వ్యభిచారం రొంపిలోకి లాగుతూ.. విదేశాలకు సప్లయ్ చేస్తున్న ఓ ముఠాని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. బంగ్లాదేశ్ కేంద్రంగా ఈ ముఠా కార్యకలాపాలు సాగిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. అంతేకాకుండా ఈ అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా రాకెట్లో ప్రమేయం ఉన్న ఆరుగురిని రాచకొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. హైదరాబాద్, రాజస్థాన్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఈ రాకెట్ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు బాలికలు, ఓ మైనర్, ఆమె సోదరిని పోలీసులు ఈ ముఠా బారి నుంచి కాపాడారు.
బాధితురాలిలో ఒకరు తన 15 ఏళ్ల సోదరిని వ్యభిచారంలోకి దింపింది. అయితే.. నిర్వాహకులు తన చెల్లిని బలవంతంగా మహారాష్ట్రకు తీసుకెళ్లారని పేర్కొంటూ ఉప్పల్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి బాధితురాలిని మోసగించి నకిలీ గుర్తింపు పత్రాలతో నగరానికి తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపినట్లు తెలుస్తోంది.
ఈ నెల 7న రాచకొండ కమిషనరేట్ పరిధిలో వ్యభిచార రాకెట్ నడుపుతున్న ఓ మహిళను జవహర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. సిరిగాడి అరుణ అనే నిందితురాలు 2019 నుంచి మానవ అక్రమ రవాణా, వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులు జవహర్‌నగర్‌లో అద్దెకు తీసుకుని, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళలను తీసుకువచ్చి బ్రోతల్ హౌస్ నడుపుతున్నారు.
కస్టమర్లకు తమ లొకేషన్ షేర్ చేసి అమ్మాయిల విషయాలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా విటులు ఉన్న ప్రాంతాలకే వాట్సాప్ ద్వారా సమాచారం చేరవేసి వారి లొకేషన్ ఆధారంగా అమ్మాయిలను పంపిస్తున్నారు. ఇట్లా బలవంతంగా ఓ యువతిని వ్యభిచారంలోకి నెట్టారు. కాగా, నిందితుడు కస్టమర్ల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.