Monday, November 25, 2024

Hyderabad: పెట్టుబడి పేరిట 10వేల కోట్ల మోసం.. హవాలా నడుపుతున్న పది మంది అరెస్టు!

లక్షలాది మందిని మోసం చేసి వందల కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డ విదేశీ, స్వదేశీ కేటుగాళ్లను హైదరాబాద్​ సిటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ భారీ పెట్టుబడి మోసంపై సైబర్​ క్రైమ్స్​ పోలీసులకు కంప్లెయింట్​ రావడంతో దానిపై ఫోకస్​ పెట్టారు. దీంతో పలు బ్యాంకుల్లో కరెంట్​ అకౌంట్లను ఓపెన్​ చేసి.. విదేశాలను హవాలా ద్వారా మనీ పంపుతున్న  ముఠాని కనిపెట్టారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం ఆదాయం వస్తుందంటే ఎవరు కాదంటారు. డబ్బులు ఊరికే రావన్నట్టు ఇంట్లో కూర్చుని లక్షలాది రూపాయల కమీషన్​ ఇస్తామంటే ఎవరైనా కాదంటారా? అయితే.. ఇక్కడ జరిగిన తీరుతో అటు నిర్వాహకులు, ఇటు వారికి హెల్ప్​ చేసిన వారు పోలీసులకు అడ్డంగా బుక్​ అయ్యారు. హవాలా కేసులో ఇరుక్కొని కటాకటాలు లెక్కిస్తున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్​ సిటీ పోలీస్​ కమిషనర్​ సీవీ ఆనంద్​ తెలిపిన వివరాల ప్రకారం.. లక్షలాది మందిని మోసం చేసి 903 కోట్ల రూపాయలను కాజేసినందుకు గాను ఒక చైనీస్, తైవాన్ జాతీయుడితో సహా పది మందిని హైదరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.1.91 కోట్లు ఫ్రీజ్ అయ్యాయి.

ఎనిమిది మంది భారతీయులు తమ బ్యాంకు ఖాతాలను అందించడం ద్వారా విదేశాలకు నగదు బదిలీ చేయడంతో ఈ స్కామ్‌ ఈజీగా జరిగిందని సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఇది రూ. 10,000 కోట్ల కుంభకోణం కూడా కావచ్చునని, ఇది భారతీయ, విదేశీ ఖాతాల నెట్‌వర్క్ ద్వారా అనుమానాస్పద పెట్టుబడిదారుల డబ్బును వైట్​ చేయడానికి చేస్తున్న మోసం అని సీపీ అభిప్రాయపడ్డారు. నిందితులు హవాలా స్కామ్‌ను బాంబే, ఢిల్లీ నుంచి నడుపుతున్నారు. కాగా, హైదరాబాద్ సైబర్ క్రైమ్స్​ అధికారులు ఈ కేసులో నిందులను అరెస్ట్ చేశారు.

నిందితుల్లో సాహిల్ బజాజ్, సన్నీ అకా పంకజ్, వీరేందర్ సింగ్, సంజయ్ యాదవ్, నవనీత్ కౌశిక్, మహ్మద్ పర్వేజ్ (హైదరాబాద్), సయ్యద్ సుల్తాన్ (హైదరాబాద్), మీర్జా నదీమ్ బేగ్ (హైదరాబాద్), చైనా జాతీయుడు లెక్ అకా లీ జాంగ్‌జున్, చు చున్-యు (తైవాన్ జాతీయుడు) ఉన్నారు.

- Advertisement -

ఈ మోసం ఎట్లా జరిగిందంటే..

భారీ పెట్టుబడి మోసంపై సైబర్ క్రైమ్స్​ అధికారులకు ముందుగా కంప్లయింట్ రావడంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. LOXAM అనే ఇన్వెస్ట్ మెంట్ యాప్‌లో 1.6 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి మోసపోయానని ఓ వ్యక్తి ఫిర్యాదుతో ఇది వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుదారుడి డబ్బును జిందాయ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఇండస్ ఇండ్ బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ బ్యాంకు ఖాతాను వీరేందర్ సింగ్ జిందాయ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓపెన్​ చేశారు. కాగా, వీరేందర్ సింగ్‌ను పూణేలో అదుపులోకి తీసుకుని విచారించగా.. అతను వీరి సూచనల మేరకు జిందాయ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బ్యాంకు ఖాతా తెరిచినట్లు వెల్లడించాడు. జాక్ అనే చైనీస్ వ్యక్తి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, బ్యాంక్ అకౌంట్ పాస్ వర్డ్ కూడా జాక్ కు ఇచ్చినట్టు వెల్లడించాడు.

ఇక.. విచారణలో హైదరాబాద్ పోలీసులు బెటెన్చ్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, జిందాయ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ బ్యాంక్ ఖాతా ఒకే ఫోన్ నంబర్‌తో ఉన్నట్టు గుర్తించారు. ఢిల్లీకి చెందిన సంజయ్ కుమార్ లెక్ (లి ఝౌంజౌ) సూచనల మేరకు బెటెంచ్ ఖాతాను తెరిచి చైనాలోని పెయి, హువాన్ జువాన్‌కు ఇచ్చాడు. అదేవిధంగా, అతను మరో 15 బ్యాంక్ ఖాతాలను ఓపెన్​ చేసి, వాటిని ముంబైలో తాత్కాలికంగా నివసిస్తున్న తైవాన్‌కు చెందిన చు చున్-యుకు పంపాడు. ఈ క్రమంలో అతడిని నిన్న ముంబైలో అరెస్టు చేశారు.

చు చున్-యు ఇతర దేశాలకు ఖాతా వివరాలు, యూజర్​ ID, పాస్‌వర్డ్, SIM కార్డ్ లను పంపుతున్నట్టు పోలీసుల ఎంక్వైరీలో తెలిసింది. సంజయ్ యాదవ్, వీరేందర్ రాథోర్ ఒక ఖాతాకు రూ.1.2 లక్షల కమీషన్ తీసుకున్నారు. దీనిని Lec ఏర్పాటు చేశాడు. Xindai Technologies Pvt Ltd ఖాతా నుండి 38 ఇతర బ్యాంక్ ఖాతాలకు డబ్బు బదిలీ జరిగింది. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ సుల్తాన్‌, మీర్జా నదీమ్‌ బేగ్‌ బ్యాంకు ఖాతాలకు కూడా ఈ నగదు చేరినట్టు తెలిసింది. మీర్జా నదీమ్ బేగ్, సయ్యద్ సుల్తాన్ పర్వేజ్ సూచనల మేరకు కమీషన్‌పై బ్యాంక్ కరెంట్ ఖాతాలను ఓపెన్​ చేశారు. అతను ఆ బ్యాంకు ఖాతాలను దుబాయ్‌లో నివసిస్తున్న ఇమ్రాన్‌కు ఇచ్చాడు. ఇమ్రాన్‌తో పాటు మరికొందరు ఈ రెండు బ్యాంకు ఖాతాలను పెట్టుబడి మోసాలకు ఉపయోగించుకున్నారు.

Xindai Technologies Pvt Ltd యొక్క 38 ఖాతాల నుండి పెద్ద మొత్తంలో డబ్బు రంజన్ మనీ కార్ప్, KDS Forext Pvt Ltdకి వెళ్లినట్టు గుర్తించారు. నవనీత్ కౌశిక్ బ్యాంకు ఖాతాలో వచ్చిన డబ్బును ఇంటర్నేషనల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో నిర్వహిస్తున్న ఫారెక్స్ ఎక్స్ఛేంజీలకు పంపుతాడు. రూపాయిల్లో వచ్చిన డబ్బును అమెరికా డాలర్లుగా మార్చి సాహిల్, సన్నీలకు ఇచ్చాడు. అయితే. మనీ చేంజర్‌లు, ఫారెక్స్ ఎక్స్ఛేంజీలకు ఆర్‌బీఐ లైసెన్స్ ఇవ్వడం ద్వారా వీరి మనీ ఎక్చేంజ్​ అనేది చాలా ఈజీగా మారింది.

అయితే.. నగదు మార్పిడి కార్యకలాపాలకు సంబంధించి ఆర్‌బీఐ గైడ్​లైన్స్​ని వీరు పదేపదే ఉల్లంఘించారని సీపీ ఆనంద్ చెప్పారు. సాహిల్, సన్నీ అకా పంకజ్, ఇతర మోసగాళ్లతో చేతులు కలిపి పైన పేర్కొన్న డబ్బును హవాలా ద్వారా విదేశాలకు బదిలీ చేశారు. 7 నెలల వ్యవధిలో రంజన్ మనీ కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాకు రూ.441 కోట్ల లావాదేవీలు జరిగాయి. కెడిఎస్ ఫారెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాలో మరో 462 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టు తమ విచారణలో వెల్లడయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement