హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ మరో వారం రోజుల్లో వెలువడనుందా? ఈ మేరకు ప్రధాన రాజకీయ పార్టీలకు సంకేతాలందాయా? వారం రోజులుగా ముమ్మరంగా సాగుతున్న ఆయా పార్టీల కార్యకలాపాలు దీన్ని బలపరుస్తున్నాయి. ఈనెల 16న సీఎం కేసీఆర్ హుజూరాబాద్‌లో దళితబంధు పథకం ప్రారంభిస్తారని తొలుత ప్రకటించారు. అయితే పథకాన్ని ఆగస్ట్ 5 నుంచే అమలు చేస్తున్నారు. వాసాలమర్రి దళితవాడను సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు దళితబంధు లబ్దిదారులకు విడుదల చేయడం చూస్తే.. హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూలు విడుదల సంకేతాలందడమే కారణమనే ప్రచారం సాగుతోంది.
టీఆర్ఎస్ లో పాడి కౌశిక్‌రెడ్డి , మాజీ మంత్రి పెద్దిరెడ్డి చేరికలకు సీఎం కేసీఆర్ స్వయంగా హాజరవడం , కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ చేయడం వంటి పరిణామాలు వేగంగా చోటుచేసుకున్నాయి. మంత్రి హరీశ్‌రావు హుజూరాబాద్‌లో పార్టీ సమన్వయంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. మరో మంత్రి గంగుల కమలాకర్ , ఇతర ఎమ్మెల్యేలు హుజూరాబాద్‌లోనే మకాం వేశారు. దీనికంతటికీ ఉపఎన్నిక షెడ్యూలుపై సంకేతాలు రావడమే కారణమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ బరిలో దింపనుందని ప్రచారం జరుగుతోంది. సర్వే రిపోర్టు ఆధారంగా ఆయనను సీఎం కేసీఆర్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
పాదయాత్రలో అస్వస్థతకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. ఆగిన చోటు నుంచే తిరిగి పాదయాత్ర పునః ప్రారంభించాలని యోచిస్తున్నారు. శస్త్రచికిత్స అనంతరం ఇటీవల ఈటల డిశ్చార్జ్ అయ్యారు. ఆయన కోలుకునేందుకు వారం, పది రోజులు పడుతుందని సన్నిహితులు అంటున్నారు. అయితే , ఈటల మాత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగానే నేరుగా హుజూరాబాద్ వెళ్లారు. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడకుండానే ఈటల హుటాహుటీన నియోజకవర్గానికి వెళ్లడం వెనుక ఉపఎన్నిక షెడ్యూలు వార్తలే కారణమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా హుజూరాబాద్ ఉపఎన్నికపై చర్చించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన పార్టీ నేతలు అభ్యర్థి విషయంపై సమాలోచనలు చేశారు. అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలని? అనేదానిపై నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. మూడు ప్రధాన పార్టీల్లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూలు వారాంతంలోగా వెలువడుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నారు.
ఇది కూడా చదవండిః త్వరలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ.. దళిత వర్గానికి డిప్యూటీ సీఎం పదవి!