తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు నిర్వహించినా ముందుగా ఇంటెలిజెన్స్ వర్గాల చేత సర్వేలు చేయించుకోవడం కేసీఆర్‌కు కొత్తేం కాదు. తాజాగా హుజురాబాద్ ఉపఎన్నికపైనా గులాబీ బాస్ సర్వే చేయించారు. సుమారు 40 మంది రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులను కేసీఆర్ నియమించారని.. ఇప్పటికే రెండు సార్లు సర్వే నివేదికలను కేసీఆర్‌కు సమర్పించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయనకు షాకింగ్ న్యూస్ తెలిసినట్లు సమాచారం.
ఉపఎన్నిక ఫలితం ఈటల రాజేందర్‌కే అనుకూలంగా ఉందని ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా కేసీఆర్‌కు తెలిసిందని చర్చ నడుస్తోంది. రెండు సర్వేల్లోనూ స్వల్ప తేడాతో ఈటల వైపు మెజార్టీ ఓటర్లు మొగ్గు చూపించారట. అయితే ఈ నివేదికలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు కేసీఆర్ వివరించినట్టుగా సమాచారం. ఉప ఎన్నిక నిర్వహణకు 5 నెలలపైగానే సమయం ఉన్నందున.. ఎంత ఆలస్యంగా నిర్వహించేలా చేసుకోగలిగితే గెలుపునకు అంత మంచి అవకాశాలు ఉన్నాయని నివేదించారట.
కేంద్ర ఎన్నికల సంఘమే హుజురాబాద్‌కు ఉప ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే సెప్టెంబర్ 10 లోపు నిర్వహించే యోచనలో ఉందన్న వార్తలు వెలువెడుతున్నాయి. అయితే అంత త్వరగా ఎన్నికలకు వెళ్లడం టీఆర్ఎస్కు ఏ మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. ఒకవేల ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరితే.. డిసెంబర్లోనే నిర్వహిస్తే బాగుటుందని చెప్పాలని డిసైడ్ అయ్యిందని చెప్పుకుంటున్నారు. మరోవైపు ఈటల మాత్రం ఎంత వీలైతే అంత త్వరగా.. ఎన్నికలు నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరినట్టుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: కడియంపై కేసీఆర్ లెక్క ఇదేనా?