న్యూఢిల్లి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – బలహీనతల నుండే క్రూరత్వం పుట్టుకొస్తుందని రోమన్ స్టాయిక్ తత్వవేత్త లూసియస్ అన్నేయస్ సెనెక్ కొన్ని శతాబ్దాల క్రితమే చెప్పారు. రాన్రాను ప్రజల్లో క్రూరత్వం పెరుగుతోంది. రాక్షస ప్రవృతికి అలవాటు పడుతున్నారు. మానవత్వం మంటగలుస్తోంది. క్రూరజంతువులు కూడా ఆకలి తీరేవరకే ఆటవిక చట్టాన్ని అమలు చేస్తాయి. కానీ మనిషి మానవత్వాన్ని మర్చిపోతున్నాడు. తల్లిదండ్రి, అన్న, చెల్లి, భార్యాభర్త వావివరుసలు పట్టించుకోడం లేదు. తన అవసరాల కోసం, క్షణిక సుఖాల కోసం లింగబేధం, వావివరుసల్లేకుండా ఎవర్ని అయినా నిర్ధాక్షిణ్యంగా చంపేస్తున్నాడు. చంపేయడమే కాదు.. మృతదేహాన్ని ముక్కలుగా కోస్తున్నారు. వారి శరీర భాగాల్ని వేరు చేస్తున్నారు. సంచుల్లో కుక్కి ఫ్రిడ్జిల్లో నెలల తరబడి దాస్తున్నారు. తమ కుటుంబ సభ్యులు కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లకు వెళ్ళి కన్నీరు పెడుతున్నారు. ఇంతటి క్రూరత్వానికి పల్లెల్లో ఉండే పామరులే కాదు.. ప ట్టణాలు, నగరాల్లోని విద్యాధికులు కూడా ఒడిగడుతున్నారు.
ఓ మహిళ తమ వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్నాడని ప్రియుడితో కలసి తొమ్మిదేళ్ళ కుమారుడ్ని దారుణంగా చంపేసింది. ఆస్తికోసం వృద్దులైన తల్లిదండ్రుల్ని పెద్దకొడుకు ఇంట్లో పెట్టి సజీవదహనం చేసేశాడు. ఓ రైల్వే మాజీ ఉద్యోగిని నెలవారీ పింఛన్ కోసం భార్య, కొడుకు, కుమార్తె కలసి ముక్కలుగా నరికేశారు. ఓ వ్యక్తి 15ఏళ్ళ కుమార్తెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. నిరాకరించడంతో ఆమెను చంపేశాడు. ముక్కలుగా చేసి వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు. ఓ మహిళ ప్రియుడితో ఉండగా చూసిన తల్లిని హత్య చేసింది. ఇలా.. కుటుంబ సభ్యులపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. హైస్కూల్ రోజుల నుంచి మహిళలపై దాడులు జరుగుతున్నాయి. కాలేజీ రోజులకొచ్చేసరికి ప్రేమంటూ వెంటపడ్డం.. కాదని నిరాకరిస్తే అడ్డంగా నరకడం లేదా యాసిడ్ దాడులకు పాల్పడ్డం నిత్యకృత్యంగా మారింది.
అందుబాటులోకొచ్చిన అశ్లిలత, విశృంఖలత్వం మనుష్యుల భావాల్ని తీవ్రంగా దిగజారుస్తున్నాయి. వారిని అసాంఘిక ఊబిలోకి లాగుతున్నాయి. సంస్కృతి, సంప్రదాయాల్ని పక్కనపెట్టేలా చేస్తున్నాయి. కట్టుబాట్ల చేధింపులకు పురికొల్పుతున్నాయి. లైంగిక వాంఛ పెరిగింది. అది పశుత్వంగా మారింది. కామాంధకారంతో కళ్ళు మూతబడుతున్నాయి. మద్యం, మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా అందుబాటులోకొచ్చాయి. నగదు అవసరాలు పెరిగాయి. వీటి కోసం తన తమ తర బేధభావాల్ని మర్చిపోతున్నారు. వృద్దులైన తల్లిదండ్రుల్ని కూడా నిర్ధాక్షిణ్యంగా చంపి కాటికి పంపేస్తున్నారు. భావోద్వేగాల్ని అదుపు చేయలేక పోతున్నారు. క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు.
భారతీయ యువతపై కొన్ని దశాబ్దాలుగా ఐరోపా, అమెరికాల సంస్కృతి ప్రభావం పెరిగింది. ఆర్ధికంగానే కాక సంప్రదాయ, ఆహార విషయాల్లోనూ భారత్ ప్రాపంచీకరణ వైపు దూసుకుపోతోంది. ఈ క్రమంలో భారత్‌లో వందల ఏళ్ళ తరబడి పాతుకుపోయిన కుటుంబ సంబంధాలు కొట్టుకుపోతున్నాయి. ఈ దేశ మూలాలైన సంస్కృతి, సంప్రదాయాలు మంటగలిసి పోతున్నాయి. జనంలో వింత ప్రవృతులు దుష్పరిణామాలకు దారితీస్తున్నాయి. ఈ సంఘటనలు మానవ సమాజానికే సవాల్ విసురుతున్నాయి. శాస్త్ర, సాంకేతికాభివృద్ధి నేటి తరాలకు మెరుగైన సౌకర్యాల్ని అందుబాటులోకి తెచ్చింది. వారిలో సృజన్మాకతను పెంపొందించింది. అన్వేషణా ధోరణిని బలపడేలా చేస్తోంది. అదే సమయంలో మానవ ప్ర వృతి సమాజాన్ని విచ్చిన్నం చేయడానికి దోహదపడుతోంది. అక ృత్యాలు, అనర్థాలు, హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దమనకాండలు, అహంకారం, అహంభావం, పురుషాధిక్యత, స్త్రీ ఆధిక్యత, ఆధిపత్య ధోరణులు సామాజిక రుగ్మతలుగా మారాయి. సామాజిక చింతన నిర్వీర్యమైంది. ప్రేమానురాగాలు, మానవ సంబంధాలు కృతకంగా మారాయి. మనిషిలో క్రూరత్వం ప్రబలుతోంది.
ప్రతి సంఘటనకు మానసిక శాస్త్ర రీత్యా పలు కారణాలుంటాయి. అయితే ప్రస్తుతం మానసిక రుగ్మతలకు ప్రధాన కారణం భారతీయ సంస్కృతి, సంప్రదాయాల అమలు పట్ల కుటుంబ పెద్దల్లో కూడా నిర్లక్ష్యం పేరుకుపోవడమే. గతంలో ఉమ్మడి కుటుంబాలుండేవి. వృద్దులు, పిల్లలకు నీతి చంద్రికలు, భారత, భాగవత, రామాయణ ఇతిహాసాలు, వివరించేవారు. మంచిచెడ్డల్ని విశదీకరించేవారు. జీవన విలువలను నేర్పేవారు. నిర్ణీత వయసొచ్చే వరకు పిల్లలు పూర్తిగా పెద్దల అదుపాజ్ఞలకు లోబడే ఉండేవారు. దీంతో మానవ సంబంధాల మధ్య మాధుర్యం వారికి తెలిసేది. పరస్పర విశ్వాసం ఏర్పడేది. స్వార్థం, అసూయ, ద్వేషాలు, ఏహ్యభావం, కులాధిపత్యం, ఆర్థిక ప్రాధాన్యతలపై పెద్దగా అవగాహన కలిగేదికాదు. ఈ కారణంగానే వారంతా ప్రశాంతంగా జీవించేవారు. కానీ సామ్రాజ్యవాదం, ప్రాపంచీకరణ, యాంత్రీకరణల నేపథ్యంలో మనిషి పనితీరులో వేగం పెరిగింది. పిల్లల ఆలోచనాధోరణి పసిగట్టే వీలు కూడా పెద్దలకు కొరవడింది.
ఎవరికి వారే యమునాతీరే అన్న రీతిలో కుటుంబ సభ్యులు వ్యవహరించడంతో కౌమార దశ నుంచే స్వతంత్ర ఆలోచనా ధోరణులు పెరుగుతున్నాయి. మానవ ప్రవృత్తి కలుషితమౌతోంది. సినిమాలు, టీవీలు, సమకాలిన సామాజిక మాద్యమాలు కూడా యువత చిత్తప్రవృత్తిలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. క్లబ్‌లు, పబ్‌లు, ఈవెంట్లలోని పలు సంఘటనలు యువతను లైంగికంగా ప్రేరేపిస్తున్నాయి.
ఈ దుస్థితిని సమాజం నుంచి పారద్రోలేందుకు చిన్ననాటి పాఠ్యాంశాల నుండి కూడా మార్పుతేవాల్సిన అవసరాన్ని సామాజిక, మానసిక విశ్లేషకులు నొక్కి చెబుతున్నారు. చిన్ననాటి పుస్తకాల్లోనే నీతిని బోధించే కథలు, పాఠ్యాంశాలు, వ్యాసాలు, మహానుభావుల జీవిత చరిత్రలు అందుబాటులో ఉంచాలని పేర్కొంటున్నారు. చరిత్ర, సంస్కృతులపై అవగాహన కల్పించే పాఠ్యాంశాల్ని ప్రవేశపెట్టాలంటున్నారు. నైతిక విలువలకు ప్రత్యేకంగా క్లాసులు తీసుకోవాలి. ఉన్నత తరగతుల ఉపాధ్యాయులు సవబుకాలిన రాజకీయ, ఆర్థిక, చారిత్రక అంశాలకు, భారతీయ సంస్కృతి, విలువల్ని కూడా జోడించి విద్యార్థులకు బోధించాలి. అలాగే చట్టాలు, న్యాయవ్యవస్థ మానసిక శాస్త్ర ఆలోచనల్ని అందుబాటులో ఉంచాలి. అప్పుడే వికృతంగా పరివర్తన చెందుతున్న మనిషి ఆ ప్రమాదం నుంచి బయటపడతాడు. భారతీయ సమోన్నత వారసత్వాన్ని కొనసాగించగలుగుతాడని పేర్కొంటున్నారు.