హైదరాబాద్, ఆంధ్రప్రభ: మానవ అక్రమరవాణా అమానుషమని, చాలా దేశాల్లో దీన్ని అరికట్టేందుకుకఠిన చట్టాలు ఉన్నాయని, మన రాష్ట్రంలో కూడా పోలీస్ శాఖలో ప్రత్యేక విభాగం ఏర్పాటు అవసరమని రాష్ట్ర హైకోర్టు అభిప్రాయపడింది. చిన్నారుల అదృశ్యం, మానవ అక్రమ రవాణాను అరికట్టే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్ ), పిటిషన్లను బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీ విచారించారు. ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశాల మేరకు పసిపిల్లల అదృశ్యం, మానవ అక్రమ రవాణాపై న్యాయసేవాధికార సంస్థ హైకోర్టుకు నివేదిక సమర్పించింది.
ఈ నివేదికను పరిశీలించిన ధర్మాసనం చిన్నారుల అదృశ్యం, మానవ అక్రమ రవాణాపై తీసుకుంటున్న చర్యలు పెద్దగా లేకపోవడం, బాలల సంరక్షణ కేంద్రాలలో పరిస్థితులపై ఆశ్చర్యం వ్యక్తంచేసింది. తప్పిపోయిన బాలలను సంరక్షించే కేంద్రాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో లేవని, ప్రభుత్వేతర సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్నాయని నివేదికలో పేర్కొంది. అక్కడ ఆరోగ్యకర పరిస్థితులు లేవని తెలిపింది. నివేదికను పరిశీలించిన డివిజన్ బెంచ్ హోంశాఖ కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 20కి వాయిదావేసింది.
ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి తగు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ధర్మాసనాన్ని అభ్యర్థించింది. ఇప్పటికిప్పుడు ఆదేశాలు జారీ చేయలేమని, కోర్టులకు కూడా పరిధులు ఉంటాయని ,అన్నింటిని కోర్టుల ద్వారా పరిష్కరించలేమని వ్యాఖ్యానించింది. మానవ అక్రమ రవాణాకు గురవుతున్న బాధితులను రక్షించడంతో పాటు పునరావాసం కల్పించి సమాజంలోమమేకం చేయాల్సిన తక్షణ బాధ్యత అందరిపై ఉందనీ, చాలా దేశాల్లో ఇదోపెద్ద నేరమని సీజే భూయాన్ వ్యాఖ్యానించారు. సున్నితమైన ఈ అంశంపై దర్యాప్తు అధికారులతో పాటు న్యాయాధికారుల్లో కూడా అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్ మాఫియా, ,వణ్యప్రాణులు, మానవఅక్రమ రవాణా అంతర్జాతీయంగా సాగుతోందని, ఇవన్నీ మానవాళికి సవాల్‌గా మారాయనని ఆందోళన వ్యక్తంచేసింది.