దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 3.19 లక్షలుగా ఉండగా, 2,764 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 17,6,25,735 చేరుకుంది. ఇక మృతుల సంఖ్య 2 లక్షల మార్క్‌కు చేరువైంది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో క్రియాశీల కేసుల వాటా 16.25 శాతానికి పెరిగింది. మొత్తంగా 28,82,204 మంది కరోనాతో బాధపడుతున్నారు. ఇంత ఉద్ధృతిలోనూ.. రికవరీలు కాస్త ఊరటనిస్తున్నాయి. తాజాగా 2,51,827 మంది కొవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. మొత్తంగా కోటీ 45లక్షల మందికి పైగా వైరస్ నుంచి బయటపడగా..రికవరీ రేటు 82.62 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇక ఎనిమిది రాష్ట్రాల్లో… మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, తమిళనాడుల్లో యాక్టివ్ కేసులు సంఖ్య తీవ్రంగా ఉంది. మరోవైపు, నిన్న 33,59,963 మందికి కేంద్రం టీకాలు అందజేసింది. మొత్తంగా 14,52,71,186 టీకా డోసులను పంపిణీ చేసింది. ఇక ముందస్తు చర్యగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచనలు చేసింది. అనవసరంగా బయట తిరగడవద్దని, ఇంట్లోనే ఉండాలని, ఇళ్లల్లో కూడా మాస్క్‌లు ధరించాలని కోరింది. మహారాష్ట్ర అత్యధిక కరోనా కేసులతో, 7 లక్షలకు పైబడిన యాక్టివ్ కేసులతో విలవిల్లాడుతోంది. ఆ తర్వాత స్థానంలో ఉత్తరప్రదేశ్, కర్ణాటక ఉన్నాయి. మరోవైపు, ఢిల్లీలోని పేషెంట్ల కోసం రాయ్‌గఢ్, ఛత్తీస్‌గఢ్‌లో ఆక్సిజన్ నింపుకున్న తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు 70 టన్నుల లైఫ్ సేవింగ్ ఆక్సిజన్‌తో దేశ రాజధానికి చేరింది. దేశంలో ఆక్సిజన్ నిల్వల కొరత లేదని, ప్రజలు భయాందోళనలు చెందవద్దని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.