పసిఫిక్ మహాసముద్రం ప్రాంతంలో వరుస భూకంపాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. శుక్రవారం న్యూ కలెడోనియా కు
తూర్పున ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అలాగే ఈరోజు ఉదయం అదే ప్రాంతంలో మరోసారి భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 7.1 గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
సముద్ర ఉపరితలానికి 35 కిలోమీటర్ల లోతులో, న్యూ కలెడోనియన్ ద్వీపసమూహానికి తూర్పున 300 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. ఈ పరిణామంతో సమీపంలోని ద్వీపదేశాలైన వనౌతు, ఫిజీ, న్యూకలెడోనియా, కిరిబాటి, వాలిస్, ఫుటునా దేశాలకు సునామీ పొంచి ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం అప్రమత్తం చేసింది.