దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ రెమిడెసివిర్ ఇంజక్షన్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. తెలుగురాష్ట్రాలు సహా దేశంలోని పలు చోట్ల ఈ ఇంజక్షన్ల కోసం కరోనా బాధితుల బంధువులు ఎగబడుతున్నారు. రెమిడెసివర్ కోసం మెడికల్ షాపుల దగ్గర రోగుల బంధువులు క్యూ కట్టారు. అయితే, కరోనా చికిత్సలో ఉపయోగించే రెమిడెసివిర్ ఔషధం కూడా లభించడం లేదు. దీంతో చాలామంది బాధితులు పరిస్థితి విషమించి మరణిస్తున్నారు.
రెమిడిసివర్ యాంటీ-వైరల్ ఔషధం. ఇది వైరస్ పెరగకుండా ఆపుతుంది. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం రెమిడిసివర్ క్రిటికల్ కేసుల్లో ఉపయోగించాల్సి వస్తుంది. ఈ కేసుల్లో లక్షణాలను త్వరగా తగ్గించడానికి రెమిడిసివర్ ఉపయోగపడుతుంది. కరోనా సోకిన బాధితులు మరింత త్వరగా కోలుకునేందుకు ఇది సహకరిస్తోందని గుర్తించారు. సాధారణంగా కరోనా సోకిన వారు ఇతర పద్దతుల్లో కోలుకునేందుకు సగటున 15 రోజులు పట్టేది. అయితే రెమిడెసివర్‌ను తీసుకున్నవారు మాత్రం 10 రోజుల్లోనే రికవరీ అయినట్టుగా నిర్దారించారు. అయితే, రెమిడెసివేర్ వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలి. మోడరేట్ కరోన లక్షణాలు ఉన్న వారు మాత్రమే రెమిడెసివేర్ వాడాలి. అత్యవసర సమయంలో వాడకానికి మాత్రమే దీనికి అనుమతి ఉంది. దీనికి మరణాలను ఆపగలిగే శక్తిలేదు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు వెంటిలేటర్ లేదా ఆక్సిజన్‌పై చికిత్స చేస్తున్నప్పుడు లేదా ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు మొదటి 9 రోజుల్లోనే రెమిడెసివిర్ ఇవ్వాలి. ఎందుకంటే వైరస్ లోడ్ రెట్టింపయ్యే అవకాశం ఉంది. దీనివల్ల త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంది.
మరోవైపు రెమిడెసివిర్ సంజీవని కాదనేది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. మరణాలను ఇది తగ్గించదని, మరో మంచి యాంటీవైరల్ డ్రగ్ లేనందువల్ల రెమిడెసివిర్ ను వాడుతున్నామని తెలిపారు. ఆసుపత్రుల్లో చేరి… ఆక్సిజన్ పై ఉన్నవాళ్లకు ఇది ఉపయుక్తంగా ఉంటుందని రుజువైందని చెప్పారు. 85 శాతం మంది కరోనా రోగులు రెమిడెసివిర్ తో 5-7 రోజుల్లోనే పూర్తిగా కోలుకున్నారని వివరించారు. చాలా మందికి జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కూడా తగ్గిపోయాయని గులేరియా చెప్పారు.
వైరస్ సోకి శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్న వారికి ఆక్సిజన్ తో పాటు రెమిడెసివిర్ ఇంజక్షన్లను ఇస్తున్నారు. ఇటీవల ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యతో పాటే రెమిడెసివిర్ ఇంజక్షన్ల వినియోగం కూడా పెరిగింది. దీంతో ఒక వైపు కరోనా కల్లోలం సృష్టిస్తున్న క్రమంలో కరోనా వైద్యంలో కీలకమైన రెమిడెసివర్ ఇంజెక్షన్ మాత్రం దొరకడం లేదు. ఈ క్రమంలో కరోనా బాధితుల అవసరాన్ని ఆసరగా చేసుకొని.. వారికి సహాయం చేస్తామని చెప్పి దోచుకుంటున్నారు అక్రమార్కులు.
రెమిడిసివర్ ఇంజక్షన్ అందుబాటులోకి లేకపోవడంతో చాలా కేసులలో వ్యాధి లక్షణాలను తగ్గించడంలో జాప్యం జరుగుతుంది. అందువల్ల పేషెంట్లు ఎక్కువరోజులు ఆసుపత్రిలోనే గడపాల్సి వస్తుందని వారంటున్నారు. హెటిరో, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, జుబిలెంట్ లైఫ్ సైన్సె్‌సకు చెందిన జుబిలెంట్ జెనరిక్స్, మైలాన్, సిప్లా, జైడస్ క్యాడిలా, సన్ ఫార్మా.. రెమిడెసివర్‌ను తయారు చేస్తున్నాయి. కొవిడ్ కేసులు పెరగడంతో రెమిడెసివర్ ఇంజెక్షన్ల ఉత్పత్తిని పెంచమని కంపెనీలను కేంద్ర ప్రభుత్వం కోరింది.
కరోనా వచ్చిన రోగులకు చేసే వైద్యంలో రెమిడెసివర్ మాత్రమే ఏకైక ఇంజెక్షన్ కావడంతో దానికి విపరీతమైన డిమాండ్ ఉంది. కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఈ ఇంజెక్షన్ కు డిమాండ్ కూడా తీవ్రంగా ఉంది. అయితే డిమాండ్ కు సరిపడా సరఫరా జరగని పరిస్థితి నెలకొంది. ప్రైవేటులో పూర్తి స్థాయిలో ఇంజక్షన్లు కొరత ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు బ్లాక్ మార్కెట్ లో సైతం రెమిడెసివిర్ ను విక్రయిస్తున్నారు. మరికొందరు వ్యాపారులు కాసులకు కక్కుర్తి పడి మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఫలితంగా ఒక్కో ఇంజక్షన్ ధర భారీగా పెరిగింది. దీంతో సాధారణ, మధ్యతరగతి ప్రజలు వేల రూపాయలు పోసి ఇంజక్షన్లు కొనలేక చికిత్స చేయకపోతే ప్రాణాలను కాపాడుకోలేక సతమతమవుతున్నారు.
మరోవైపు తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వారంలోగా 4 లక్షలకుపైగా రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందేలా చూస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. బుధవారం రెమిడెసివిర్ ఉత్పత్తిదారులతో మంత్రి కేటీఆర్ చర్చలు జరిపారు. సీఎం ఆదేశాల మేరకు ఉత్పత్తిదారులతో చర్చించినట్లు తెలిపారు.