Friday, November 22, 2024

కరోనా నేర్పిన గుణపాఠం.. ఇల్లు ఎలా ఉండాలి?

కరోనా ఫస్ట్ వేవ్‌ సమయంలో సొంతిల్లు ఎంత అవసరమో తెలిసేలా చేస్తే.. రెండో ఉధృతిలో ఎలాంటి ఇల్లు అవసరమో గుర్తించేలా చేసిందని పలువురు భావిస్తున్నారు. కోవిడ్‌ భయాలు.. లాక్‌డౌన్‌ ఆంక్షలతో కుటుంబ సభ్యులు రోజుల తరబడి ఇంటికే పరిమితం అవుతున్నారు. నాలుగు గోడల మధ్య కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా ఇంటి నిర్మాణం ఉండాలి. కరోనా ఒక్కటే కాదు ఇతరత్రా అనారోగ్యాల బారిన పడకుండా ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండాలంటే తగిన వెంటిలేషన్‌ తప్పనిసరి. సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నా, నిర్మాణం పూర్తైన ఇంటిని కొనుగోలు చేస్తున్నా ఇలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్మాణ రంగంలోని నిపుణులు సూచిస్తున్నారు.

రెండు పడక గదులు ఉండాలి
విశాలమైన ఇళ్లలో ఉన్న వారిలో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. కనీసం రెండు పడక గదుల సొంత ఇల్లు ఉండాలనే అవసరాన్ని కొవిడ్‌తో చాలామంది గుర్తించారు. పిల్లలకు ఇంటి నుంచి పాఠాలు, పెద్దలకు ఇంటి నుంచే పనితో స్థోమతను బట్టి మూడు, నాలుగు పడక గదుల ఇళ్లు, విల్లాలకు మారిపోయిన వారు ఉన్నారు. విశాలమైన ఇళ్లలో గాలి, వెలుతురు వచ్చేలా ఉంటాయి.

ఇంటికి రెండు కిటికీలు ఉండాలి
పాత రోజుల్లో ప్రతి గదికి రెండు కిటికీలు ఉండేవి. ఒక దాంట్లోంచి ఇంట్లోకి గాలి వస్తే.. మరో దాంట్లోంచి బయటికి వెళ్లేందుకు నిర్దేశించేవారు. దీంతో గదిలోని వేడి గాలి ఎప్పటికప్పుడు బయటికి వెళ్లిపోయేది. ఒకటే కిటికీ ఉంటే పైభాగంలో వెంటిలేటర్‌ బిగించేవారు. దీంతో వేడిగాలి గది పైభాగంలో చేరి వెంటిలేటర్‌ నుంచి బయటికి వెళ్లేది. వేసవిలోనూ గదులు చల్లగా ఉండేవి. ప్రస్తుతం వెంటిలేటర్ల ఊసే లేదు. ఒక కిటికీ అయినా సరే గదిలోకి తగిన గాలి, వెలుతురు వచ్చే దిక్కులో ఏర్పాటు చేసుకుంటే మంచిది. పగటిపూట కిటికీలు తెరుచుకున్నా ప్రైవసీకి భంగం కలగకుండా సౌకర్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

స్నానాల గదుల్లో వెంటిలేషన్ ఉండాలి
గతంలో స్నానాల గదిని ఇంటి మధ్యలో నిర్మించేవారు. హోటళ్లు, ఆసుపత్రుల గదుల మాదిరి మధ్యలో స్నానాల గదిని నిర్మించి పైనుంచి వెంటిలేషన్‌ ఏర్పాటు చేసేవారు. అయినా బాత్రూమ్‌ చీకటిగా ఉండేది. కామన్‌వాల్స్‌ ఉన్నప్పుడు ఇలాంటి సమస్య ఉండేది. బహుళ అంతస్తుల భవనాల్లో ఈ సమస్య లేదిప్పుడు. బయటి నుంచి తగిన వెలుతురు, గాలి వచ్చేలా గది బయటి వైపు నిర్మిస్తున్నారు. స్నానాల గదుల్లో చీకటి ఉంటే దుర్వాసన వెదజల్లడం, రకరకాల బ్యాక్టీరియా, వైరస్‌చేరి అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. వ్యక్తిగత ఇళ్లలో స్థలాభావంతో స్నానాల గదులు ఇరుకిరుకుగా, చీకటిగా ఉంటున్నాయి. వీటి నిర్మాణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

దేశంలో మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో 2006 తర్వాత నిర్మించిన బహుళ అంతస్తుల నిర్మాణాలు అత్యధికం హరిత భవనాల కిందకే వస్తాయని ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌, హైదరాబాద్‌ ఛాప్టర్‌ అధ్యక్షుడు సి.శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకు అప్పట్లో తీసుకొచ్చిన జీవో నంబరు 86 కారణమన్నారు. వాస్తుకు ప్రాధాన్యం ఇస్తూ.. అప్పటి వరకు ఉన్న నిబంధనలను మార్పులు చేయడంతో కామన్‌ వాల్స్‌ అనేవి లేకుండా పోయాయి. ప్రవేశ ద్వారం వైపు తప్ప ఫ్లాట్‌కు మిగతా మూడువైపులా ఖాళీ స్థలమే ఉంటుంది. దీంతో ఇంట్లో అన్ని గదుల్లో తగిన వెలుతురు, గాలి ఉంటోంది. అంతర్గతంగా గాలి నాణ్యత మెరుగ్గా ఉండటంతో త్వరగా అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement