– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లు తమ శాసనసభ్యుల నికర ఆస్తుల విలువల విషయాన్ని ఆరా తీస్తున్నారు. గెలిచేదాకా ఎంతుండే.. ఆ తర్వాత ఎంతగా ఆస్తులు పెరిగాయనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 2018లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలంతా స్వయంగా ప్రమాణ స్వీకారం చేసిన అఫిడవిట్లను విశ్లేషించి తెలంగాణ ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఓ రిపోర్టు విడుదల చేసింది. 2014 నుంచి 2018 వరకు పార్టీల వారీగా ఎన్నికైన ఎమ్మెల్యేల సగటు ఆస్తుల పెరుగుదల ఎట్లుందో ఇక్కడున్న చార్ట్‌లో చూడొచ్చు.
ప్రధానంగా ఇందులో.. బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఆస్తులు గణనీయంగా అంటే 3376శాతం పెరిగినట్టు స్పష్టమవుతోంది. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేల ఆస్తులు కూడా 133శాతం పెరిగాయి. ఆ తర్వాత బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల ఆస్తులు 77.85శాతం, ఎంఐఎం ఎమ్మెల్యేల ఆస్తులు 42శాతం పెరగగా.. అందరికంటే తక్కువగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆస్తులు తక్కువ శాతం పెరిగినట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. వీరి ఆస్తుల విలువ కేవలం 24 శాతం మాత్రమే పెరిగింది.
తెలంగాణలోని వివిధ రాజకీయ పార్టీల్లో బీజేపీ ఎమ్మెల్యేల ఆస్తులు మాత్రమే పెరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది. వీరి ఆస్తులు అత్యధికంగా పెరిగినట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక స్పష్టం చేస్తోంది. 2014లో బీజేపీ ఎమ్మెల్యే సగటు ఆస్తులు రూ. 9 లక్షలు ఉండగా.. 2018లో వారి ఆస్తుల విలువ రూ. 3 కోట్లకు పెరిగి 3376.08గా నమోదైంది. ఇక బీఆర్ఎస్ విషయానికొస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేల సగటు ఆస్తులు 77.85 శాతం పెరిగినట్టు తెలుస్తోంది.