Tuesday, November 19, 2024

Cyber Crime: ఒక్క మెస్సేజ్ ఎంత‌ప‌నిజేసిందంటే.. 48వేలు న‌ష్ట‌పోయిన లేడీ డాక్ట‌ర్‌!

పొద్దున్నే నిద్రలేచేసరికి ఆ పెద్దాయ‌న‌ సెల్‌ఫోన్‌కి ఒక మెసేజ్ వచ్చింది. ‘‘మీరు ఈ నెల‌ కరెంట్ బిల్లు కట్టలేదు. ఇవ్వాల‌ కూడా బిల్లు కట్టకపోతే సాయంత్రం 9.30 తర్వాత క‌రెంట్‌ కనెక్షన్ కట్ చేస్తాం’’ అనేది ఆ మెస్సేజ్‌ సారాంశం. దాంతో ఆందోళ‌న‌కు గురైన‌ ఆయన.. డాక్టర్‌గా పనిచేస్తున్న తన కూతురికి మెసేజ్ చూపించాడు. ఆ మెస్సేజ్‌ని చ‌దివి బిల్లు నిజంగానే కట్టలేదని అనుకున్న ఆమె ఆన్‌లైన్ ద్వారా బిల్లు చెల్లించింది.

ఇక‌.. ఆ తర్వాత చూస్తే ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి దాదాపు రూ.48,500 ఖాళీ అయిన‌ట్టు ఆమెకు అర్థమైంది. ఈ ఘటన ముంబైలో వెలుగు చూసింది. ఘట్కోపర్‌కు చెందిన బాధితురాలు.. తండ్రి ఫోన్‌కు వచ్చిన మెసేజ్ చూసి కంగారుపడింది. వెంటనే కరెంట్ బిల్లు క‌ట్టేందుకు ప్రయత్నించిన‌ట్టు తెలుస్తోంది.

అయితే.. మెసేజ్‌లో ఉన్న ‘‘ఎలక్ట్రిసిటీ ఆఫీసర్’’ నెంబరుకు కాల్ చేసింది. అతను ఒక యాప్ డౌన్‌లోడ్ చేసుకొని పేమెంట్ చేయాలని చెప్పాడు. తండ్రి ఫోన్‌లో అలా చేయడం కుదరలేదు. దాంతో తన మొబైల్‌లోనే ఆమె ఆ యాప్ డౌన్‌లోడ్ చేసింది. ఆ తర్వాతే తను మోసపోయినట్లు తెలుసుకుంది. ఈ క్రమంలో పోలీసులను ఆశ్రయించిందా లేడీ డాక్ట‌ర్‌. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement