Tuesday, November 26, 2024

డీపీఆర్‌ సమర్పించకుండా కాళేశ్వరానికి జాతీయ హోదా ఎట్లా సాధ్యం: బండి సంజయ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : స్మార్ట్ సిటీ పేరుతో కేంద్రం ఇచ్చిన నిధులతో కరీంనగర్‌లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం… మళ్లి కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని విమర్శలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కరీంనగర్‌లో గురువారం ప్రారంభోత్సవం చేసిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం కరీంనగర్‌లో బండి సంజయ్‌తో కలిసి కార్యకర్తలు, నాయకులు హోలీ సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సంజయ్‌ బదులిచ్చారు. నిన్న టీఆర్‌ఎస్‌ నాయకులు సభలో ఏది మాట్లాడినా నడుస్తుందన్నట్టుగా వ్యవహరించారని మండిపడ్డారు. స్మార్ట్ సిటీ కోసం కేంద్రం ఇచ్చిన నిధులతో గురువారం ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారని, పైగా కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారన్నారు. వేములవాడ రాజన్న ఆలయానికి ప్రసాదం పథకం కింద ప్రతిపాదనలు పంపితే కేంద్రం నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం ప్రతిపాదనలు పంపలేదని, ఈ విషయంపై ఎన్నిసార్లు మొత్తుకున్నా స్పందన లేదన్నారు.

కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో జాతీయ రహదారి రోడ్ల నిర్మాణానికి సీఆర్‌ఐఎఫ్‌ కింద రూ. 205 కోట్లు తెచ్చానని, ప్రధానమంత్రి సడక్‌ యోజన, ఈజీఎస్‌ కింద వేలాది కోట్లు తెస్తున్నామన్నారు. ఎల్కతురి ్త- సిద్దిపేట రోడ్డు నిర్మాణానికి ఈ మధ్య పెద్దఎత్తున నిధులు తీసుకొచ్చామన్నారు. అయినప్పటికీ ఎంపీగా ఎన్నికైన నేను ఏమీ చేయలేదని టీఆర్‌ఎస్‌ నేతలు పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. అసలు తెలంగాణకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పకుండా కేంద్రంపై ఏడ్వడం దేనికోసమని నిలదీశారు. మత పిచ్చి లేపుతున్నానని చెబుతున్న వాళ్లకు.. నేను సగర్వంగా హిందువునని చెప్పుకుంటానని, హిందువులు రెచ్చగొడితే రెచ్చిపోయేవాళ్లు కాదన్నారు. ఎంఐఎం కోసం మైనారిటీ సంతుష్ట విధానాలను అవలంబించే మీ లాంటోళ్లకు బుద్ధి చెబుతామన్నారు. ఎంపీగా అడ్డిమార్‌ గుడ్డిసూట్‌లో గెలిచారనే ఆరోపణలు చేస్తున్న వాళ్లు నన్ను కరీంనగర్‌ ప్రజలు లక్ష ఓట్లతో గెలిపించిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు.

టీఆర్‌ఎస్‌ గెలిచేందుకు వంద కోట్లు ఖర్చు పెట్టినా ఆ పార్టీ అభ్యర్థిని ఓడించారన్నారు. అందరూ కలిసినా బీజేపీని ఏమీ చేయలేకపోయారన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని సీఎం సహా టీఆర్‌ఎస్‌ వారంతా గెలిచారన్నారు. సీఎం అయ్యాక కేసీఆర్‌ నీటి వాటాలో తెలంగాణకు అన్యాయం చేశారని, ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్నారన్నారు. డీపీఆర్‌ పంపకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎలా ఇస్తారు? ఏది పడితే అది చెబితే జనం వాత పెడతారని టీఆర్‌ఎస్‌ నేతలు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. గంగులపై పోటీ చేయాలంటూ చెప్పే మాటలను పట్టించుకోమన్నారు. టీఆర్‌ఎస్‌కు భయం పట్టుకుందని, హిందుత్వం, బీజేపీ, కాషాయం అంటేనే వణుకు మొదలైందన్నారు. అందుకే టీఆర్‌ఎస్‌ సభను అడ్డుకుంటామనే భయంతో బీజేపీ కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేశారన్నారు. అడ్డుకోవాలనే నీచ సంస్కృతి బీజేపీకి లేదన్నారు. టీఆర్‌ఎస్‌ లెక్క బీజేపీ ఏక్‌ నిరంజన్‌ పార్టీ కాదు జాతీయ పార్టీ, ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే దానిపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని, ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక ఎవరైనా సరే దానికి కట్టుబడి ఉండాల్సిందేనని అన్నారు. దాని ప్రకారమే బండి సంజయ్‌ అయినా.. ఇంకెవరైనా పోటీ చేయాల్సిందే.. పని చేయాల్సిందేనని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement