Friday, November 8, 2024

Big Story: హోలీ పండుగ ఎట్లా వచ్చింది.. సంప్రదాయాలు, ఆచారాలు ఏమిటి?

హోలీ పండుగ అంటే రంగులు చల్లుకోవడం.. కోలాటం ఆటలు.. గ్రామాల్లో అయితే రెండు కర్రలు(కోలలు) పట్టుకుని ఒక్కో గ్యాంగ్​ (కొంతమంది పిల్లలు) ఊరంతా తిరుగుతూ పాటలు పాడి.. తోచిన కాడికి విరాళాలు సేకరిస్తారు. ఆ వచ్చిన అమౌంట్​తో హోలీ పండుగనాడు కావాల్సిన రంగులు తెచ్చుకుని సంబురాలు చేసుకుంటారు. అంతేకాకుండా లక్షీ నరసింహస్వామి దర్శనానికి వెళ్లి జాతరలో ఎంజాయ్​ చేస్తారు. ఇది ఇప్పటిదాకా తెలంగాణ పల్లెల్లో జరిగే తంతు.. కానీ, కరోనా కారణంగా ఈ రెండేళ్లుగా పండుగలు, సంబురాలు అంతలా లేకుండా పోయాయి. జనాలు గుమిగూడి సంబురాలు చేసుకోవడం చాలా మట్టుకు తగ్గింది. అయితే.. వ్యాక్సినేషన్​తో కాస్త పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మళ్లీ నార్మల్​ లైఫ్​ దిశగా అంతా రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా హోలీ పండుగ.. దాని విశేషాలు తెలుసుకుందాం.. హోలీ అంటే రంగులు చల్లుకోవడం, కాముడి దహనం.. వంటివి ఎన్నో మనకు తెలుసు అసలు హోలీ పండుగ ఎందుకు వచ్చింది. దీని వెనుక ఉన్న పురాణ కథలు, ఆచరణాత్మకమైన వివరాలు ఏంటి.. ప్రచారంలో ఉన్న కథలను చదివి తెలుసుకుందాం..

హిందూ పురాణాల ప్రకారం భక్త ప్రహ్లాదున్ని చంపడానికి ప్రయత్నం చేసిన హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి దహనానికి సంకేతంగా సంప్రదాయ భోగి మంటలను వేస్తారు. విజయదశమి రోజున రావణుడిని ప్రతిమను దహనం చేసినట్లు ఈ పండుగ రోజు కూడా ప్రతిమను దహనం చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రాక్షసుల పరాక్రమం హోలిక దహనంతో అంతమయిందని దీని అర్థం. బ్రజ ప్రాంతాలలో, కర్రలను కుప్పగా చేసి ప్రజలు ఎక్కువగా తిరిగే కూడళ్లలో, వీధి చివరలో ప్రతిమలను దహనం చేస్తారు. సంప్రదాయమైన పూజల తరువాత ప్రజలు మంటల చుట్టు ప్రదక్షిణ చేస్తారు. తరువాత రోజు ఈ విజయాన్ని దుల్‍‌హెండి రోజుగా ఘనంగా జరుపుకుంటారు.

హోలీ అంటే.. విశ్వవ్యాప్తంగా ప్రకాశించే రంగుల పండుగ. పురాణ కథలతో పాటుగా హోలీ పండుగ వెనుక మరో పరమార్థం ఉంది. హోలీ పండుగను వసంత ఋతువు ఆగమనంగా పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఇది చలికాలం తొలగి పోయి ఎండాకాలం ఆరంభానికి నాంది ప్రస్థావన వంటిది. హోలీ పండుగను సాధారణంగా “ఫాల్గుణి పూర్ణిమ” నాడు జరుపుకుంటారు. ఇలా ఒక రుతువు వెళ్లి మరో రుతువు వచ్చే సమయంలో ముఖ్యంగా శీతాకాలం ‘చలి’ వెళ్లిపోయి ఎండాకాలం ‘వేడి’ వచ్చే సమయంలో ఉష్ణోగ్రతల తేడావల్ల చర్మం  చిట్లుతుంది. రంగులు ఆ చిట్లటం వల్ల కలిగే చికాకును తగ్గిస్తాయి.

రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మ ద్వారా వరం పొందాడు. ఇతడిని “పగలు లేదా రాత్రి సమయంలో ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో, మనుషుల వలన, జంతువుల వలన, అస్త్రములు, శస్త్రములచే చావు లేకుండా వరాన్ని పొందాడు. దానితో అతడికి దురహంకారం పెరిగి, స్వర్గం ,  భూమిపై దాడి చేశాడు. ప్రజలు దేవుళ్లని ఆరాధించడం మాని, తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు. దీనికి విరుద్ధంగా, హిరణ్యకశ్యపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే, అది అమృతంగా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించ గలిగాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

చివరిగా ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది. ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాం. భగవంతుడైన విష్ణువు నరసింహ అవతారంలో (సగం మనిషి, సగం సింహం) వచ్చి హిరణ్యకశ్యపుడిని సంధ్యా సమయంలో (పగలు లేదా రాత్రి కాని) అతని ఇంటి గడప మెట్లపై (లోపల లేదా ఇంటి బయట కాదు) తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకొని (ఆకాశంలో లేదా భూమి పైన కాదు) తన యొక్క పంజాతో చీల్చి చెండాడినాడు (అస్త్రాలు లేదా శస్త్రాలచే కాకుండా).

- Advertisement -

రాధ మరియు గోపికల హోలీ :

ఈ పండుగను భగవంతుడైన కృష్ణుడి పెరిగిన ప్రాంతాలైన మథుర, బృందావనంలలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు (ప్రతి సంవత్సరం రంగపంచమి రోజున భగవంతుడైన కృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు). భగవంతుడైన కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. కృష్ణుడు తన తల్లితో అతని నల్లని శరీర రంగు, రాధ శరీర రంగు మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేశాడని నమ్ముతారు. కృష్ణుడి తల్లి రాధ ముఖానికి రంగు పూయాలని నిర్ణయించుకుంది. అధికారికంగా ఈ ఉత్సవాలు వసంత రుతువులో అంటే ప్రేమ వికసించే మాసంలో జరుపుకుంటారు.

హోలీ పుట్టుక వివరాల గురించి మరో కథ కూడా ఉంది. ఈ కథ ప్రేమ దేవుడైన కామదేవుడు గురించి తెలుపుతుంది. పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా శివుని తపస్సును భంగపరచడానికి అతనిపై పూల బాణం వదిలిన కామదేవుని శరీరాన్ని శివుడు నాశనం చేసాడు. తరువాత శివుడు, తన త్రినేత్రాన్ని తెరిచి, కామదేవుని శరీరాన్ని బూడిద చేశాడు. కామదేవుని భార్య రతి కోరికమేరకు శివుడు కామదేవుడిని మళ్లీ బతికిస్తాడు కానీ, భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేక పూరితప్రేమ ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బతికిస్తాడు. ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకొంటారు.

దేశంలో వివిధ ప్రాంతా ల్లో హోలీ వేడుకలు..

ఒడిశా: ఒడిశాలోని జగన్నాథ, పూరీ ఆలయాలలో కృష్ణుడు, రాధ విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు జరిపించి ఆ తరువాత వేడుకలు ప్రారంభిస్తారు.


గుజరాత్ :
గుజరాత్ లో ఈ పండగను అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా మంటలు వేసి దాని చుట్టూ చేరి నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ ఆనందిస్తారు. అందరూ పెద్ద మైదానం లాంటి ప్రదేశం వద్ద గుమికూడి సామూహికంగా కూడా మంటలు వేస్తారు. ఈ మంటల్లో ఇంట్లో ఉన్న పాత చెక్కసామానులన్నీ తీసుకొచ్చి వేస్తారు.

మహారాష్ట్ర : మహారాష్ట్రలో హోలిక దిష్టిబొమ్మను దహనం చేస్తారు. హోలీ వేడుకకు ఒక వారం ముందు యవకులు ఇంటింటికి తిరిగి పాత చెక్క సామానులు సేకరిస్తారు. ఉదయం వేసిన మంటలు సాయంత్రం దాకా మండుతూనే ఉంటాయి. అంత పెద్ద ఎత్తున మంటలు వేస్తారు. ఈ మంటలకు ప్రత్యేకంగా చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తారు.

మణిపూర్ : మణిపూర్ లో ఓ ఆచారం ఉంది. మగపిల్లలు ఆడపిల్లలకు డబ్బులు ఇస్తేనే ఆడపిల్లలు వారి మీద రంగులు చల్లుతారు. రాత్రి సమయంలో చిన్నాపెద్దా అందరూ కలిసి ఒక చోట చేరి మంటల చుట్టూ తిరుగుతూ నృత్యం చేస్తారు. ఇక్కడ వారం రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. చివరిరోజు కృష్ణుడి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు.

కాశ్మీర్ : సైనికుల పహారాలో, తుపాకుల చప్పళ్లతో ఉద్రిక్తంగా ఉండే అందాల కాశ్మీర్ లో సైనికులతో సహా అందరూ హోలీ ఉత్సవాలలో పాల్గొంటారు. ఆటపాటలతో రంగు నీటిని ఒకరిమీద మరొకరు చల్లుకుంటూ సంబురాలు చేసుకుంటారు.


ఉత్తర ప్రదేశ్ : ఉత్తర ప్రదేశ్ లోని మథురకు దగ్గరగా ఉన్న బర్సన అనే ఊళ్లో హోలీని వెరైటీగా జరుపుకుంటారు. అక్కడ హోలీ సందర్భంగా మహిళలు మగవారిని లాఠీలతో పిచ్చకొట్టుడు కొడతారన్న మాట. దీన్నే వారు లఠ్ మార్ హోలీ అని ముద్దుగా పిలుచుకుంటారు. లఠ్ అంటే లాటీ అని అర్థమట. దీనికి ఓ ప్రత్యేక కారణముంది. పురాణ కాలములో చిలిపి క్రిష్ణుడు, తనకెంతో ఇష్టమైన రాధ గ్రామానికి వచ్చి అక్కడ ఆమెను, ఆమె స్నేహితురాళ్లను ఆటపట్టించాడట. దీనిని తప్పుగా భావించిన ఆ గ్రామం మహిళలు, కర్రలతో క్రిష్ణయ్యను వెంట తరిమారట. అప్పటినుండి, ఈ పండగ ఇలా జరుపుకోవాడం ఆనవాయితీగా వస్తోంది. పక్కనే ఉన్న క్రిష్ణుడి గ్రామం, నంద్‌గావ్ నుండి మగవారు హోళీ ఆడడానికి ఈ గ్రామం రావడం,  హుషారుగా హోళీ పాటలు పాడడం, ఆడవారిని రెచ్చగొట్టడం వారిచేతిలో లాఠీ దెబ్బలు తినడం ఆనవాయితీ అన్న మాట.  కాకపోతే, ఆడవారు కొట్టే దెబ్బలను వారు ఢాలు వంటి దానిని ఉపయోగించి తప్పించుకోవచ్చు.  ఆడవారు కూడా వారిని ఢాలు మీదనే ఎక్కువగా కొడతారు.

ఈ హోలీకి అక్కడ ఒక నెల రోజుల ముందు నుండే ప్రిపరేషన్ జరుగుతుంది. అత్తలు తమ కోడళ్లకు ఆ నెల రోజులు మంచి పౌష్టిక ఆహారం పెడతారట, బాగా కొట్టడానికి. ఇక్కడ కొట్టడం అనేది వారిని గాయపరచడానికి కాడు, వారి పట్ల తమ ప్రేమను చెప్పడానికి మాత్రమే అని చెబుతారు గ్రామస్తులు. ఇలాంటిదే మరో హోలీ హర్యానాలో జరుగుతుంది. దాని పేరు “కరోర్ మార్” హోలీ ఇక్కడ వదినలు (మరదళ్లూ కూడా)  మరిదిని (బావను కూడా అని నా అనుకోలు) పిచ్చ కొట్టుడు కొట్టడం స్పెషాలిటీ.   సంవత్సరమంతా వారు తమ మీద వేసిన జోకులకూ సెటైర్లకూ, టీజింగులకు ఆరోజు కసి తీర్చుకుంటారన్న మాట.  ఇది కేవలం కుటుంబమంతా తమ విభేదాలను మర్చిపోయి,  కలిసి మెలసి జీవించడనికి చేసుకునే పండగ అని, ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయమనీ చెబుతున్నారు. విశేషమేమిటంటే, లాఠ్ మార్ హోలీలా ఇక్కడ మగవారు ఢాలు లాంటివి తెచ్చుకోరు, ఆడవారు కూడా కేవలం దెబ్బలు తగలకుండ కొట్టడం అనే కాన్సెప్టును ఫాలో అవ్వరు. ఏది దొరికితే అది అడ్డుపెట్టుకొని తప్పించుకోవాలి, లేదా తన్నులు తినాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement