హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: ఎన్నికల వేళ.. రాష్ట్ర వ్యాప్తంగా కోటి పేద కుటుంబాలకు ఇళ్ళ పట్టాలివ్వాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సాధ్యమైనంత త్వరలోనే నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్‌రూం ఇళ్ళను ప్రారంభించే దిశగా చర్యలు మొదలుపెట్టింది. మొదటి దశలో ప్రతి అసెంబ్లి నియోజకవర్గానికి వెయ్యి ఇళ్ళ చొప్పున కేటాయించి గ్రామీణ ప్రజల మెప్పు పొందేవిధంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి ఈ నెల 9న జరిగే మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే నెలలో 2.50 లక్షల డబుల్ బెడ్‌రూం ఇళ్ళ ప్రారంభానికి ముహూర్తం కూడా ఖరారు చేయనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 60వేల మంది పేదలకు ఇళ్ళ పంపిణీ కూడా అతిత్వరలోనే ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి పేద కుటుంబానికి సొంతిళ్ళు ఉండి తీరాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు కంకనబద్దులు కావాలని మంత్రివర్గ ఉపసంఘం ఇదివరకే సూచించింది. మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని సబ్‌కమిటీ తీర్మానాలను సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశం ముందుంచేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆ అంశాన్ని కేబినెట్ అజెండాలో చేర్చారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలోె ప్రతి మండలంలోనూ అర్హులైన పేదలకు పట్టాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయింపు, జీఓ 58, 59 అమలు, సాదాబైనామా, నోటరీ పత్రాలు, ఎండోమెంట్, వక్ఫ్ భూములు తదితరాల అమలుకు సంబంధించిన అంశాలపై మంత్రిమండలి సమావేశంలో చర్చించనున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి కుటు-ంబాలకు తక్షణ లబ్ధి చేకూరుతుంది. తెలంగాణ ఏర్పాటైన కొత్తలో 2014లో 1.25 లక్షల మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. జీవో 58 క్రింద 20,685 ఇళ్లకు సంబంధించి ఇప్పటికే వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇంటి స్థలాల పట్టాల జారీని వేగవంతం చేయాలని సబ్ కమిటీ- అధికారులను ఆదేశించిన నేపథ్యంలో దాదాపు అనన్‌ఇ జిల్లాల్లో లబ్ధిదారుల జాబితాలు కూడా సిద్ధం చేశారు. నోటరీ చేయబడిన పత్రాలు, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న కేసుల ప్రక్రియను, సమయానుకూల కార్యాచరణ ప్రణాళికను కూడా కేబినెట్ భేటీలో చర్చించి పరిష్కరించనున్నారు. పేదలకు అనుకూలమైన మరిన్ని కొత్త విధానాలను తీసుకోవాలని ముఖ్యమంత్రి మదిలో ఉన్న ఆలోచనలను ఈ సమావేశంలో ఆవిష్కరించనున్నారు.