ఇప్పటి వరకు సినిమా థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించేవి. కరోనా కేసుల కారణంగా ఇటీవల ఆస్పత్రుల వద్ద బెడ్లు దొరక్క హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు చనిపోయిన వారిని దహనం చేసేందుకు స్మశానాల్లో కూడా హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అంటే ఎంతటి భయానక పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోండి. సెకండ్ వేవ్‌లో మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడమే ఇందుకు కారణం. చాలా వాటికల్లో హౌస్ ఫుల్ బోర్డులు పెడుతున్నారు. కరోనా శవం కాలాలంటే.. కనీసం రెండు రోజులైనా వేచి చూడాల్సిందే. లేదంటే.. మీకు ఏదైనా ప్లేస్ ఉంటే అక్కడ చేసుకోండి తెగేసి చెప్పేస్తున్నారు శ్మశాన వాటిక నిర్వాహకులు.
కర్ణాటకలో కరోనా తీవ్ర రూపం దాల్చడంతో అక్కడ మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. దాదాపు రోజుకు ఒక్కో శ్మశానవాటికకు 20శవాల వరకు వస్తున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. రోజుకు 200మందికి పైగా చనిపోవడంతో ఈ పరిస్థితులు వస్తున్నాయని చెబుతున్నారు. ఇవి కేవలం అధికారికంగా ప్రకటించినవే. అనధికారికంగా ఎక్కువే ఉండొచ్చు. బెంగళూరులో 13 కరెంట్ శ్మశాన వాటికలు ఉన్నా.. అక్కడ కూడా హౌస్ ఫుల్ బోర్డులు పెడుతున్నారంటే ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే అవసరం ఉంటేనే బయటకు వెళ్లండి.