కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న తెలుగు రాష్ట్రాలను ఇప్పుడు మరో ముప్పు భయపెడుతోంది. వేసవి ప్రారంభంలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో అప్పుడే వడగాలులు తీవ్రరూపం దాల్చుతున్నాయి. వీటి ప్రభావంలో సాధారణం కంటే 4-6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీ, తెలంగాణలో వడగాలుల తీవ్రత పెరగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పుడే ఎండలు ముదరు పోతే ఇంకా ఏప్రిల్, మే మాసంలో ఎండలు ఎంతగా మండిపోతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మార్చిలోనే సూర్యుడు కన్నెర్ర చేస్తుంటే…. రానున్న రెండు నెలల్లో ఎండలను తలచుకుంటేనే టెన్షన్ పడుతున్నారు.
గత రెండు, మూడు రోజులుగా సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అదనంగా నమోదవుతున్నాయి. దీంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలోని హైదరాబాద్ సహా ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉంది. అటు, ఏపీలోని విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, జిల్లాల్లో ఎండలు మరింత ఠారెత్తిస్తున్నాయి. తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత 42-44 డిగ్రీలు నమోదు కానుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో రాబోయే రెండు, మూడు రోజుల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్లో ఒకట్రెండు రోజుల్లో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. దీంతో పగటి పూట అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వెళ్లినా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.