హైదరాబాద్, ఆంధ్రప్రభ: జన తెలంగాణ! ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. ముఖ్యంగా, అన్నిపార్టీల్లోని అసంతృప్త్తులు, మళ్లి టిక్కెట్ దక్కదేమోనన్న బెంగతో ఉన్న నేతలు, ఎంతోకాలంగా జెండామోసినా పార్టీ గుర్తించడం లేదని, ఎటు వంటి పదవి రాలేదని బాధపడుతున్న వాళ్లు ఇప్పుడు ఏకమై జన తెలంగాణ పేరిట ఒకే గొడుగు కిందకు చేరుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, ముందుండి నడిపించే నేత కనిపించక దిక్కులు చూస్తున్నారు.
భాజపాలో ఇమడలేక ఇబ్బంది పడుతున్న కొత్త నేతలు, కాంగ్రెస్‌లో అవకాశాల్లేక అసంతృప్తితో రగులుతున్న సీనియర్, జూనియర్ నేతలు, భారాసలో ఈసారి టిక్కెట్ దక్కదన్న అను మానంతో మరికొందరు, ఏదో ఒక పదవి కూడా దక్కలే దని తీవ్ర ఆవేదనతో మిగిలిన ఇంకొందరు ద్వితీయ శ్రేణి నేతలు ఈ ఆలోచనకు ఆకర్షితులవుతున్నారు. ఈ ఆలోచన ఎవరికి ఎక్కడ ఎప్పుడు పుట్టిందో కాని, ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ఆయా నేతలు, దిగువ శ్రేణి కార్యకర్తల వాట్సప్ గ్రూపుల్లో మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది.
దీనికితోడు భాజపా చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్ వెలిబుచ్చిన అభిప్రాయా లతో దీనికి మరింత బలం చేకూరుతోంది. అలా గే, భాజపా ట్రాక్ సరిగ్గా లేదని, ఉత్తర భారత దేశంలో అమలు చేసిన వ్యూహాలను ఇక్కడ అమలు చేయా లనుకోవడం అవివేకమవుతుందని ఇటీవల మీడియాలో పలువురు నేతలు పరోక్షంగా లీకేజీలిచ్చారు. పైగా, కాంగ్రెస్ నుంచి 30 నుంచి 40 మంది నేతలను లాగలేకపోతే భాజపా గెలవడం దాదాపు అసాధ్యమన్న అభిప్రాయాలు కూడా అందులో వ్యక్తమయ్యాయి.
కాంగ్రెస్‌లోనూ పరిస్థితి పెద్దగా మార్పు లేదు. పీసీసీ నేత రేవంత్‌కు అన్ని గ్రూపులు సహకరించడం లేదు. మొన్నటి వరకూ పార్టీలో విబేధాలు భగ్గుమంటూనే ఉన్నాయి. నిన్న కర్నాటకలో కాంగ్రెస్ గెలవడంతో ఇప్పుడు ఐక్యతా రాగాలు ఆలపిస్తున్నా ఇంకా అసమ్మతి సద్దు మణగలేదు. ఆయా వర్గాల మధ్య పొరపొచ్చాలు అలాగే ఉన్నాయి. తాజాగా సీనియర్ నేత వీహెచ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు అనుగుణంగానే ఉన్నాయి. కాంగ్రెస్‌పై బురద జల్లిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని మళ్లిd పార్టీలోకి తీసుకోవద్దని ఆయన అంటున్నారు. దీనివల్ల పార్టీ ఇమేజ్ తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. పార్టీలో ఇంకా చాలామంది సీనియర్లు వివిధ కారణాల వల్ల అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ద్వితీయ శ్రేణి నాయకులైతే తమకు అవకాశాలు ఇంకెప్పుడని నేరుగానే ధ్వజమెత్తుతున్నారు.
అధికార పార్టీ భారాస కూడా ఇందుకు అతీతమేమీ కాదు. అధినేత హెచ్చరికలతో ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నెలకొని ఉంది. తమకు ఈసారి టిక్కెట్ దక్కకపోవచ్చన్న నిశ్చితాభిప్రాయానికి పలువరు వచ్చేశారని అంటున్నారు. ప్రత్యామ్నాయ అవకాశాలను వీరు ఇప్పటికే తీవ్రంగా పరిశీలిస్తున్నారు. అలాగే, ద్వితీయశ్రేణి నాయకులతో కొంతమంది ఎమ్మెల్యేలకు అంతరం బాగా పెరిగింది. వీరు కూడా దిక్కులు చూస్తున్నారన్నది నిర్వివాదాంశం.
ఖమ్మం జిల్లాకు వస్తే పొంగులేటి వర్గంపైనే అందరి దృష్టి ఉంది. ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు భాజపా తీవ్రంగా ప్రయత్నించింది. ఇందుకు ఈటలను ముందుంచింది. ఆయన గత మూడు నెలలుగా ఇదే పనిలో ఉన్నారు. పలుసార్లు భేటీ కూడా అయ్యారు. కాని, తనకే పొంగులేటి, జూపల్లి రివర్స్ కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించారని ఆయన బహిరంగంగానే ప్రకటించారు.
ప్రస్తుత పరిస్థితులను, అంశాలను పరిశీలిస్తే చాలామందిలో ఒకే ఒక అభిప్రాయం అంతర్లీనంగా ఉంది. అది కొత్త గొడుగు కిందకు రావడం! దీనిపైనే ఆయా గ్రూపులు, నేతల మధ్య చర్చలు అంతర్గతంగా సాగుతున్నట్టు సమాచారం. ఆత్మాభిమానం పేరుతో వీరంతా ఏకమై జన తెలంగాణ పేరుతో పార్టీని స్థాపించి ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించాలని భావిస్తున్నట్టు విశ్లేషణలు వెలువడుతున్నాయి.
అయితే, దీనిపై కూడా తీవ్ర విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆలోచనల వెనుక మీరున్నారంటే మీరున్నారని మూడు ప్రధాన పార్టీలకు చెందిన నేతలు అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి భారాసకు మేలు చేసేందుకే ఈవిధంగా మరో శక్తిని తెరపైకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, భాజపాను దెబ్బతీయడానికి కాంగ్రెస్ ఎత్తుగడగా భాజపా నేతలు అంటున్నారు, భారాస నేతలు మాత్రం ఈ ఆలోచనలను వినోదరాయుళ్ల ప్రయత్నంగా కొట్టిపారేస్తున్నారు.