తిరువనంతపురం – కేరళలోని కోజికోడ్ జిల్లాలో సిద్ధిఖ్ అనే హోటల్ యజమానిని ఓ యువజంట అత్యంత దారుణంగా చంపారు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి ట్రాలీబ్యాగులో తీసుకువెళ్లి అటవీప్రాంతంలో విసిరేశారు. అయితే నిందితులను పోలీసులు శుక్రవారం చెన్నైలో అరెస్ట్ చేసి కేరళ పోలీసులకు అప్పగించారు. సిద్ధిఖ్ వ్యాపార నిమిత్తం కుటుంబసభ్యులకు దూరంగా కోజికోడ్ జిల్లాలోనే నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో మే 18న కోజికోడ్‌లోని ఎరంజిపాలెంలో ఉన్న ఓ హోటలులో రెండు గదులను ( బి3, బి4 ) ఆయన బుక్ చేసుకున్నారు. అదే హోటలులో పాలక్కడ్‌కు చెందిన నిందితులు శిబిల్, ఫర్హానాపై అంతస్తులో అద్దెకు దిగారు. మే 19న శిబిల్, ఫర్హానా ఓ ట్రాలీబ్యాగుతో కిందకు దిగిన విజువల్స్ హోటల్ లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ తర్వాత వీరు ముగ్గురూ కనిపించకుండా పోయారు. సిద్ధిఖ్‌కు అతడి కుమారుడు చాలాసార్లు ఫోను చేసినా అతని మొబైల్ స్విచ్‌ఆఫ్ వచ్చింది.
అయితే అదే సమయంలో అతడి ఫోనుకు తండ్రి కార్డుతో లక్ష రూపాయలు విత్ డ్రా చేసినట్లుగా ఏటీఎం నుంచి మేసెజ్ లు రావడంతో అనుమానంతో సిద్ధిఖ్ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల విచారణలో సిద్ధిఖ్ హత్య విషయం బయటపడింది. ప్రధాన నిందితుడైన శిబిల్ గతంలో సిద్ధిఖ్ హోటలులో పనిచేశాడు. అతడి ప్రవర్తన నచ్చక పనిలో నుంచి తీసివేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. అయితే ఈ హత్య వెనుక ఏదైనా హనీట్రాప్ ఉందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.