హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో ఈనెల 27, 28 తేదీల్లో హోం మంత్రుల భేటీ జరగనుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ నుంచి సెప్టెంబర్ 30వ తేదీన లేఖలు అందాయి. ఈ సమావేశంలో పోలీసు బలగాల ఆధునీకరణ, మాదక ద్రవ్యాల వంటి మత్తు పదార్థాలపై నిషేధం.. అగ్నిమాపక శాఖను మరింత బలోపేతం చేయండి.. శత్రు ఆస్తులను నియంత్రించే చట్టాల వరకు పలు అంశాలతో పాటు దేశ అంతర్గత భద్రతపై ఈ భేటీలో చర్చించి చర్యలు తీసుకోనున్నారు.
అయితే.. ఈ భేటీకి పశ్చిమబెంగాల్ సీఎం, హోం మంత్రిగా ఉన్న మమతా బెనర్జీకి కూడా ఆహ్వానం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కానీ, ఆ రాష్ట్రం నుంచి మమతా హాజరవుతారా, లేదా అన్న సమాచారం మాత్రం అందలేదని తెలుస్తోంది. కాగా, బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరూ లేఖ అందుకున్నట్లు ధ్రువీకరించలేదని సమాచారం.
ఈ సమావేశానికి రాష్ట్ర హోంశాఖ కార్యదర్శులు, డీజీపీలను కూడా ఆహ్వానించినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 30న అన్ని రాష్ట్రాలకు పంపిన ఆహ్వానంపై బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎవరూ వ్యాఖ్యానించడానికి ఇష్టపడనందున, చింతన్ శివిర్ అని పిలిచే ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ నుండి ఎవరైనా హాజరవుతారా లేదా అనేదానిపై కూడా క్లారిటీ లేదు.
ఇక.. రెండు రోజులపాటు జరిగే సమావేశం ప్రారంభ వేడుక సెషన్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మాట్లాడతారని, ఇందులో ఏడు వేర్వేరు సెషన్‌లు ఉంటాయని తెలుస్తోంది. రాష్ట్ర హోం మంత్రులు తమ రాష్ట్రాల వారీగా తీసుకుంటున్న చర్యలపై ప్రజెంటేషన్ చేయనున్నారు.
కాగా, బెంగాల్ సీఎం మమతకు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు మధ్య అంత మంచి రిలేషన్ లేదు. అంతేకాకుండా.. ఈడీ, సీబీఐ వంటి వివిధ కేంద్ర సంస్థల హైపర్ యాక్టివిటీ కారణంగా ఆమె ఇటీవల అతనిపై మండిపడుతూ సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ భేటీకి మమతా వస్తారా, లేదా అన్నది తెలియడం లేదని కొంతమంది అధికారులు చెబుతున్నారు.