తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఇంటింటి సర్వేలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండలో ఇంటింటి ఆరోగ్యం కార్యక్రమాన్ని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు,సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒక్క ఫోన్ కాల్ తో ఇంటికి వచ్చి కరోనాకి చికిత్స అందిస్తారని చెప్పారు. కరోనా ను ఎదుర్కోవడంలో భాగంగా “ ఇంటింటా ఆరోగ్యం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలు కరోనా పట్ల భయపడాల్సిన అవసరం లేదన్నారు. డాక్టర్లు సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. “ఇంటింటా ఆరోగ్యం” కార్యక్రమంలో భాగంగా ఏనుగొండలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి జ్వరాలు , దగ్గు ఇతర ఏమైనా అనారోగ్య సమస్యలున్నాయో అడిగి తెలుసుకున్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ .
అనంతరం.. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. కరోనాకు అన్ని రకాల వైద్యం అందించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం “ ఇంటింట ఆరోగ్యం ” పేరుతో సర్వే నిర్వహించి జ్వరం, దగ్గు, ఇతర కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారికి వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగానే అన్ని జిల్లా కేంద్రాల్లో ఆక్సిజన్ పడకలతో సహా అవసరమైన మందులు, ఇతర ఏర్పాట్లు చేశామని, ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..