హోలీ.. రంగుల పండుగ. చిన్నా, పెద్దా, కుల, మత, ప్రాంతీయ భేదం లేకుండా అందరూ రంగుల్లో మునిగిపోతారు. చిన్నారుల మోములు రంగులతో విచ్చుకుంటాయి. తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. హోలీ పర్వదినం ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటిరోజు పాల్గుణ పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు. భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ దేశాల్లో కూడా వైభవంగా జరుపుకుంటారు. వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను ‘వసంతోత్సవం’ పేరిట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. అయితే, ఈ సారి హోలీ పండగ కళ తప్పింది.
తెలుగురాష్ట్రాల్లో హోలీ సంబరాలు పాక్షికంగా జరుగుతోంది. కరోనా వైరస్ సెకండ్‌వేవ్ నేపథ్యంలో ఎక్కడా సందడి కనిపించడం లేదు. ప్రజలు సంబరాలు నామమాత్రంగానే నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడు చిన్నారులు, యువకులు, రాజకీయ నాయకులతో రంగులమయంగా కనిపించే పండుగ రెండేళ్లుగా కరోనాదెబ్బతో కళతప్పింది. గతేడాదితో పాటు ఈ ఏడాది కూడా హోలీ పండుగ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసింది. వైరత్ ఉదృతి నేపథ్యంలో చాలా మంది హోలీ వేడుకలకు దూరంగా ఉన్నారు.
మరోవైపు కరోనా ఆంక్షల మధ్య తెలుగురాష్ట్రాల్లని పలు జిల్లాల్లో హోలీ సంబురాలు జరిగాయి. వివిధ కాలనీల్లో వారి ఇళ్ల ముందే పలువురు సన్నిహితులతో కలిసి రంగులు చల్లుకోవడం..తిలకాలు దిద్దుకుంటూ వేడుకలు నిర్వహించుకున్నారు. చిన్నారులు ఉత్సాహంతో కేరింతలు కొట్టుకుంటూ ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. ఇక హైదరాబాద్ లోనూ హోలీ సందడి ఎక్కడ కనిపించడం లేదు. హోలీ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించడంతో నగరవాసులు వేడుకలకు దూరంగా ఉన్నారు. దీంతో నగరవాసులు ఇంటికే పరిమితం అయ్యారు. పలు కాలనీల్లో మాత్రం ప్రజలు రంగులతో సందడి చేశారు.