కొత్త సమస్యలను గుర్తించిన వైద్య నిపుణులు
వైరస్ సోకినవారిలో దెబ్బతింటున్న కిడ్నీలు
పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది ఇదే
తీవ్రవుతున్న శ్వాసకోశ వ్యాధుల సమస్యలు
ముక్కు దిబ్బడతో మొదలై అనారోగ్య సమస్యలు
దగ్గు, జలుబు, తీవ్రమైన జ్వరం వంటి లక్షణాలు
చిన్నపిల్లలు, ఓల్డ్ ఏజ్ పర్సన్స్‌లో ఎక్కువ ప్రభావం
అవగాహన పెంచుకోవాలంటున్న డాక్టర్లు
ముందస్తు జాగ్రత్తలతో వ్యాధి నుంచి బయటపడొచ్చు
ఆంధ్రప్రభ, సెంట్రల్ డెస్క్ : హెచ్ఎంపీవీని హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అంటున్నారు. ఇది శ్వాసకోస సంబంధమైన వైరస్. అందువల్ల ఇది సోకితే ప్రధానంగా శ్వాస సమస్యలు తలెత్తుతాయి. తొలుత ముక్కుదిబ్బడగా ఉండడం.. దానికి తోడు జలుబు చేయడం కనిపిస్తుంది. ఇంకా.. దగ్గు బాగా ఎక్కువగా వస్తుంది. జలుబు విపరీతంగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. రాత్రివేళ గురక కూడా వస్తుందని, ఈ లక్షణాలు మరీ తీవ్రంగా కాకుండా.. ఓ మాదిరిగా ఉంటున్నాయని తెలుస్తోంది. వీటికి తోడు జ్వరం కూడా ఉంటుందని, ప్రధానంగా ఈ వైరస్ సోకిన వారు సరిగా ఊపిరి పీల్చుకోలేకపోతున్నట్టు పలు పరిశీలనల్లో వెల్లడయ్యిందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
చాలా చిన్న వైరస్, ప్రమాదం తక్కువే
బ్యాక్టీరియా కంటే ఈ వైరస్ చాలా చిన్నదిగా ఉంటుందని తెలుస్తోంది. అందుకే వీటిని కంట్రోల్ చెయ్యడం, ఆపడం కష్టం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. హెచ్ఎంపీవీ అనేది 1970 నుంచే ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ, దీన్ని 2001లో వైద్యరంగంలోని సైంటిస్టులు గుర్తించారు. ప్రపంచ శ్వాసకోస సంబంధ సమస్యలు తలెత్తడంలో ఈ వైరస్ కారణంగా ఉంటోంది. కాగా, ఇది రెస్పిరేటరీ ఇష్యూస్ తలెత్తడంలో 4 నుంచి 16 శాతం కారణంగా ఉంటోంది. ఇక.. ఏటా నవంబర్ నుంచి మే నెలలో ఈ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఒకసారి సోకిన వారికి.. తిరిగి రెండోసారి సోకకుండా ఇమ్యూనిటీ పెరుగుతోందని పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. కానీ, ఈ వైరస్ పిల్లలు, ముసలివారిలో ఎక్కువ ప్రభావం చూపుతోంది. అలాగే.. వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండేవారికి కూడా ఈ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి.
కిడ్నీలపై ప్రభావం చూపుతుందా?
హెచ్ఎంపీవీ వైరస్‌కి సంబంధించి వైద్య నిపుణులు పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేస్తున్నారు. నెఫ్రాలజిస్టులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల జరిపిన పరిశోధనల ప్రకారం.. హెచ్ఎంపీవీకి మూత్రపిండాల (కిడ్నీ) అనారోగ్యానికీ మధ్య సంబంధం ఉందని తేలింది. ఆసుపత్రిలో చేరిన పిల్లలపై జరిపిన ఒక అధ్యయనంలో హెచ్ఎంపీవీకీ, తీవ్రమైన కిడ్నీ గాయం కీ సంబంధం ఉందని కనుగొన్నారు. వయస్సుతో పాటు కిడ్నీ గాయానికి సంబంధించిన ప్రమాదం పెరుగుతోందని తెలుస్తోంది. అయితే.. కిడ్నీ పాడవ్వడానికి శ్వాసకోశ సమస్యలే కచ్చితమైన కారణం కాకపోవచ్చని మరో పరిశోధన ద్వారా వెల్లడయ్యినట్టు డాక్టర్లు చెబుతున్నారు.
అలాంటి వారికి అతి పెద్ద సమస్య..
కొంతమంది ట్రాన్స్‌ప్లాంట్ అవయవాలు కలిగి ఉంటారు. ఉదాహరణకు కిడ్నీ, ఊపిరితిత్తులు ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్లకు హెచ్ఎంపీవీతో తీవ్రమైన అనారోగ్యం కలిగే ప్రమాదం ఉంది. అలాంటి వారు తరచూ మందులు వాడుతుంటారు. అవి రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. దాంతో వైరస్ ప్రభావం పెరుగుతుంది. ఇది తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుంది, అక్యూట్ రెస్పిరేటర్ డిస్ట్రెస్ సిండ్రోమ్ ప్రమాదాన్ని పెంచుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.. హెచ్ఎంపీవీ సోకిన వారికి డైరెక్టుగా కిడ్నీ పాడవుతున్నట్లు స్పష్టంగా తేలకపోయినా, వైరస్ ప్రభావాలను జాగ్రత్తగా పర్యవేక్షించవలసిన అవసరం ఉందని, ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువగా ఉండే వారిలో ఈ ప్రమాదం ఎక్కువ స్థాయిలో ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.