Friday, September 20, 2024

Hitech HYDRAA క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ స‌రికొత్త వ్యూహం

శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా చ‌ర్య‌లు
ఆక్ర‌మ‌ణ‌ల గుర్తింపున‌కు టెక్నాల‌జీ వినియోగం
చెరువులు, పార్కుల క‌బ్జాపై ఫోక‌స్‌
మ‌ట్టి పోయ‌డం, త‌ర్వాత‌ క‌బ్జా చేయ‌డం
అక్క‌మార్కుల ఆట‌ల‌కు ఇక చెల్లు
ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఉక్కుపాదం మోప‌నున్న ప్ర‌భుత్వం
ఇప్ప‌టికీ 262 నిర్మాణాల నేలమట్టం
111.72 ఎకరాల ప్రభుత్వ స్థల స్వాధీనం
సీఎం రేవంత్ నిర్ణయాన్ని స్వాగ‌తిస్తున్న జ‌నం
రానున్న అసెంబ్లీ భేటీలో బిల్లు పెట్టే చాన్స్‌
ప్ర‌త్యేక పోలీసు వ్య‌వ‌స్థ ఏర్పాటుకు చాన్స్‌
దేశ వ్యాప్తంగా హైడ్రా పెను సంచ‌ల‌నం
స‌పోర్ట్ చేస్తున్న ప్ర‌కృతి ప్రేమికులు
హైడ్రా చ‌ర్య‌ల‌ను స్వాగ‌తిస్తున్న ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, సెంట్ర‌ల్ డెస్క్‌:

- Advertisement -

హైడ్రా మీద వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ఆ సంస్థ టెక్నాల‌జీని అందిపుచ్చుకుంటోంది. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చెరువుల కబ్జాలను ప్రాథమికంగా గుర్తిస్తున్న సంస్థ.. అవి ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నాయా? లేదా? అన్నది తెలుసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌.. షాద్‌నగర్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీకి వెళ్లారు. రెండు దశాబ్దాల క్రితం అక్కడి చెరువులు, పరిసర ప్రాంతాలు ఎంత ఎత్తులో ఉండేవి? ఇప్పటి పరిస్థితేంటి? వంటి వివరాలను తెలుసుకునే య‌త్రం చేశారు.

మ‌ట్టిపోయ‌డం.. క‌బ్జా చేయ‌డం..

చాలా ప్రాంతాల్లో చెరువుల్లో మట్టి పోసి చదును చేస్తున్న కబ్జాదారులు అనంతరం నిర్మాణాలు చేపడుతున్నారు. గండిపేట, ఎర్రకుంట, ఈర్ల చెరువుల్లో నిర్మాణాల విషయంలో అదే జరిగింది. సాధారణం కంటే ఎనిమిది నుంచి 15 అడుగుల మేర ఎత్తు పెంచి నిర్మాణాలు చేపట్టి, తమ నిర్మాణాలు ఎక్కువ ఎత్తులో ఉన్నందున అవేవీ ఎఫ్‌టీఎల్‌ పరిధిలోకి రావని బుకాయిస్తున్న‌ వారికి టెక్నికల్ సాక్షాలతో చెక్ పెట్టాలన్నది హైడ్రా తాజా వ్యూహంగా కనిపిస్తోంది. దీని ద్వారా చెరువుల్లో పూడికతీసి, విపత్తుల నిర్వహణ చర్యలూ చేపట్టవచ్చని ఆ సంస్థ అధికారులు భావిస్తున్నారు.

హైడ్రా విస్త‌ర‌ణ దిశ‌గా స‌ర్కారు..

మరోవైపు, హైడ్రాని విస్తరించటం, బాధ్యతలను వికేంద్రీకరించటం ద్వారా సంస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి వరకు ఉన్న హైడ్రాను హెచ్‌ఎండీఏ (హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) వరకు విస్తరించి, మొత్తంగా వ్యవస్థను మూడు జోన్లుగా విభజించి, వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలనేది సర్కారు ఆలోచనగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ను సెంట్రల్‌ జోన్‌గా, సైబరాబాద్‌ను నార్త్‌ జోన్‌గా, రాచకొండను సౌత్‌ జోన్‌గా విభజించి, వీటికి జోనల్‌ అధికారులు, పూర్తిస్థాయి సిబ్బందిని నియమించేందుకు కసరత్తు మొదలైంది. ఈ మూడు జోన్లను చీఫ్‌ కమిషనర్‌ పర్యవేక్షిస్తారు. రెండు నెలల కిందట ప్రత్యేక జీవో ద్వారా ఏర్పాటైన హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు న్యాయశాఖ అధ్యయనం చేసి, అనంతరం ఆర్డినెన్స్‌ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అసెంబ్లీ భేటీలో బిల్లు..

వారం, పది రోజుల్లో ముసాయిదాను సిద్ధం చేసే దిశగా పని జరుగుతుండగా.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టానికి సంబంధించిన బిల్లును సర్కారు ప్రవేశ పెట్టనున్న‌ట్టు తెలుస్తోంది. తెలంగాణలోని అక్రమ నిర్మాణాలకు ముకుతాడు వేసేందుకు మునిసిపల్ చట్టంలోనూ మార్పులు చేసేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోంది. అక్రమ కట్టడాలు పెచ్చుమీరుతుండటంతో వాటిని మొత్తంగా స్వాధీనం చేసుకుని, వేలం వేసేందుకు వీలుగా చట్టానికి సవరణలు చేయటం ద్వారా రాబోయే రోజుల్లో ఈ తప్పు చేసేందుకు నిర్మాణదారులు భయపడతారని ప్రభుత్వం భావిస్తోంది. భవన అనుమతులు జారీ చేసేప్పుడు నిర్మాణ విస్తీర్ణంలో 10 శాతాన్ని స్థానిక సంస్థకు నిర్మాణదారులు తనఖా పెడతారు. ఒకవేళ వారు నిబంధనలను అతిక్రమిస్తే.. ఆ ప్రాంతాన్ని స్థానిక సంస్థ స్వాధీనం చేసుకోవటం లేదా ఆ అక్రమ భాగాన్ని కూలగొట్టటం చేస్తుంది. ఇకపై.. దీనికి భిన్నంగా, అనుమతికి మించి అక్రమంగా నిర్మించిన ప్రాంతం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని, బహిరంగ వేలం వేయడానికి స్థానిక సంస్థలకు అధికారం లభించేలా చట్టంలో సవరణ తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న‌ట్టు స‌మాచారం.

ప్ర‌త్యేక పోలీసు వ్య‌వ‌స్థ ఏర్పాటు..

హైడ్రా కోసం ప్రత్యేక పోలీసు వ్యవస్థనూ రేవంత్ స‌ర్కారు ఏర్పాటు చేయనుంది. సాధారణ పోలీసులను హైడ్రా బందోబస్తుకు వాడాల్సి రావటంతో స్టేషన్లలోని కేసుల పురోగతి దెబ్బతినకుండా ఉండేందుకు ఏకంగా హైడ్రా పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇలాంటి వ్యవస్థ కార్యరూపం దాలిస్తే అది దేశంలో నాలుగోది అవుతుంది. మనదేశంలో అచ్చంగా పార్లమెంటు భద్రతను పర్యవేక్షించేందుకు తొలిసారి ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయగా, తాజాగా తెలంగాణలో సైబర్‌ సెక్యూరిటీ, నార్కొటిక్స్‌ విభాగాలకు రెండు ప్రత్యేక పోలీసు స్టేష‌న్లున్నాయి. హైడ్రా కోసం మరోటి ఏర్పాటు చేయనున్నారు. ఏసీపీ స్థాయి అధికారి దీన్ని పర్యవేక్షిస్తారు. సాధారణ పోలీసులతో సంబంధం లేకుండానే ఈ హెచ్‌ఎస్‌వో వ్యవస్థే కేసులను సొంతంగా దర్యాప్తు చేస్తుంది.

క‌బ్జాల‌కు కేరాఫ్ దుర్గం చెరువు..

హైదరాబాద్ సిటీలో చెరువులు పెద్ద ఎత్తున క‌బ్జాల‌కు గుర‌య్యాయి. దీనికి దుర్గం చెరువు ఒక మంచి ఉదాహరణ. ఒకప్పుడు 154.27 ఎకరాల్లో విస్తరించి ఉన్న దుర్గం చెరువును 1980 నాటి హుడా రికార్డులు 90ఎకరాలుగా చెబుతున్నాయి. అదే ఏడాది రూపొందిన జోనల్ డెవలప్‌మెంట్ ప్లాన్ కింద 60.27 ఎకరాలను రెసిడెన్షియల్ జోన్ కింద గుర్తించారు. రాజధానిలో 2000వ సంవ‌త్స‌రంలో కురిసిన కుంభవృష్టితో నాడు ఈ చెరువు సమీప ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి. అప్పటికే అక్కడ అధికారికంగా 25 అపార్టుమెంట్లు, 79 ఇళ్లు, 14 వాణిజ్య భవనాలు వెలిశాయి. దీనిపై వివాదాలు తలెత్తడంతో ప్రభుత్వ విభాగాలే వాటికి అనుమతులిచ్చాయి. కాబట్టి కూల్చడానికి వీల్లేదని అప్పట్లో హైకోర్టు స్పష్టం చేసింది. అయితే.. అనుమతిని ఉల్లంఘించిన భవనాలను కూల్చివేయవచ్చని ఆదేశించింది.

చ‌ర్యలు తీసుకోని అధికారులు..

హైకోర్టు ఆదేశాలున్న‌ప్ప‌టికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే విధంగా శామీర్‌పేట్ సరస్సు 1989లో 486 హెక్టార్ల నుంచి 2006 లో 256 హెక్టార్లకు కుదించుకుపోయింది. మొత్తంగా, 1989 – 2001 మధ్యకాలంలో అంటే కేవలం పుష్కర కాలంలో 3245 హెక్టార్ల జలవనరులు రాజధానిలో అదృశ్యమయ్యాయి. 2010 నాటికి హుడా పరిధిలో 500 చెరువులుండగా, 2018 మే నాటికి వాటి సంఖ్య 169కి పరిమితమైంది. వీటిలో ప్రభుత్వ ఆధీనంలోని 62 చెరువుల్లో 25 ప్రైవేట్ సంస్థల యాజమాన్యం కిందకు వెళ్లాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంయుక్త యాజమాన్యంలో 82 చెరువులున్నాయి. హుస్సేన్‌సాగర్, కుంట మల్లయ్యపల్లి వంటి కొన ఊపిరితో ఉన్న చెరువులు డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి.

ప్ర‌జ‌ల నుంచి పెరిగిన మ‌ద్ద‌తు..
దశాబ్దాల తరబడి ప్రజల తమ కళ్ల‌ముందే తమ ప్రాంతాల్లోని చెరువులు, ప్రభుత్వ స్థలాలు, కుంటలు, నాలాలను నేతలు, వారి అనుచరులను అడ్డుపెట్టుకుని అడ్డంగా ఆక్రమించిన వేళ.. యువత, మేధావులు, ప్రజాసంఘాల వారు.. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఏ ప్రయోజనమూ లేకుండాపోయింది. పైగా ఆ ఆక్రమిత స్థలాల్లో అనుమతులు తెచ్చుకుని, అపార్ట్‌మెంట్‌లు, వాణిజ్య భవనాలు నిర్మించి మధ్యతరగతికి అడ్డంగా అమ్మేసి సొమ్ముచేసుకున్నారు. సామాన్య ప్రజలను నిబంధనల పేరుతో వేధించే అధికారులపై ప్రజల్లో ఉన్న ఆక్రోషం వ్యతిరేకతగా మారి అక్రమ కట్టడాలను కూలుస్తున్న ‘హైడ్రా’పై మద్దతు రావడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవ‌చ్చు..

హైడ్రా అంటే .. పున‌ర్‌నిర్మాణ‌మే!

‘హైడ్రా’ అనగానే తమకు హైడ్రోజోవాన్ జాతికి చెందిన మంచినీటి మొక్క గుర్తుకొస్తోందని కొందరు పర్యావరణ వేత్తలు గుర్తుచేస్తున్నారు. ఈ మొక్క శరీరంలో ఏ భాగం తెగిపోయినా తిరిగి పునరుత్పత్తి చేసుకునే సామర్థ్యం కారణంగా దీనికి మరణం ఉండదు. బహుశా అందుకనే ఈ వ్యవస్థకు ‘హైడ్రా’ అనే పేరును ఎంపిక చేసుకున్నారనీ, భవిష్యత్తులో ఇది తెలంగాణలోని అన్ని జిల్లాలకు విస్తరించి పర్యావరణానికి ప్రాణప్రతిష్ట చేయాలని నేడు తెలంగాణ సమాజం కోరుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement