Thursday, November 21, 2024

హిట్2.. మూవీ హిట్ కొట్టిందా.. ఫట్ అయిందా

హిట్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కింది హిట్2. నేడు ఈ చిత్రం రిలీజ్ అయింది.మరి ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కథ..కృష్ణదేవ్ అలియాస్ కేడీ (అడివి శేష్) విశాఖపట్నం హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం (హెచ్ఐటీ)లో ఎస్పీ స్థాయిలో పని చేసే అధికారి. సగటు పోలీస్ ఆఫీసర్ లాగా కాకుండా సదరాగా కనిపిస్తాడు కానీ.. ఏదైనా కేసు తన చేతికి వస్తే నిమిషాల్లో దాన్ని ఛేదించేస్తుంటాడు. క్రిమినల్స్ పట్ల కేడీకి ఒక రకమైన చిన్న చూపు ఉంటుంది. ఒక కేసును ఐదు నిమిషాల్లో ఛేదించేసిన అతను నేరస్థులవి కోడి బుర్రలని కామెంట్ చేస్తాడు. అలాంటి అతడికి ఒక అమ్మాయి హత్య కేసు సవాలు విసురుతుంది. ముందు అది ఒక అమ్మాయి హత్య అనే అనుకుంటారు. కానీ ఘటనా స్థలంలో దొరికిన బాడీలో వేర్వేరు అమ్మాయిల శరీర భాగాలున్నాయని వెల్లడవుతుంది. దీంతో ఈ కేసు తీవ్రత అర్థమై కేడీ సీరియస్ గా రంగంలోకి దిగుతాడు. ముందుకెళ్లేకొద్దీ చిక్కుముడులు.. సవాళ్లు పెరుగుతాయి. మరి ఈ మిస్టరీని అతనెలా ఛేదించాడు.. ఆ హంతకుడెవరు.. అమ్మాయిలను చంపడం వెనుక అతడి ఉద్దేశం ఏంటి అనేదే మిగతా కథ.

విశ్లేషణ.. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లు అంటే ఎలా ఉండాలో ఒక కేస్ స్టడీ లాగా ‘హిట్’ను తీర్చిదిద్దిన దర్శకుడు శైలేష్ కొలను. ఒక మర్డర్ మిస్టరీ కేసును పాయింట్ టు పాయింట్ డీటైల్డ్ గా చదువుతున్నట్లుగా అనిపిస్తుంది ఆ సినిమా చూస్తుంటే. అలాంటి దర్శకుడు.. థ్రిల్లర్ సినిమాలంటే ఇలా ఉండాలి అనిపించిన క్షణం.. గూఢచారి.. ఎవరు.. మేజర్ చిత్రాలతో హీరోగానే కాక రచయితగానూ ప్రతిభను చాటుకున్న అడివి శేష్ తో ‘హిట్’ ఫ్రాంఛైజీలో రెండో సినిమా తీశాడంటే ఉండే అంచనాలే వేరు. అందులోనూ ‘హిట్-2’ టీజర్ ట్రైలర్ వేరే లెవెల్ అనిపించాయి. ట్రైలర్లోని కొన్ని షాట్లే ఒళ్లు గగుర్పొడిచేలా చేశాయి. ఇక సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అన్న ఉత్కంఠతో థియేటర్లలో అడుగు పెడతారు ప్రేక్షకులు. వారిని రెండు గంటల పాటు కుదురుగా కూర్చోబెట్టడంలో ‘హిట్-2’ విజయవంతం అయింది. తొలి సన్నివేశం నుంచే కథలో లీనం చేసి.. చివరి వరకు సస్పెన్స్ ఫ్యాక్టర్ని క్యారీ చేయడంలోనూ ‘హిట్-2’ సక్సెస్ అయింది. కానీ కాంబినేషన్ క్రేజ్.. ప్రోమోలు ఇచ్చిన కిక్ దృష్ట్యా.. ఇంకేదో ఆశించే ప్రేక్షకులకు మాత్రం నిరాశ తప్పదు. ‘హిట్-2’లో ఏం మిస్సయింది అంటే చెప్పడం కష్టం. కానీ ఏదో మిస్సయిందనే ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. బహుశా అది ‘షాక్’ ఫ్యాక్టర్ కావచ్చు. ప్రేక్షకులు ఆశ్చర్యపోయి నోరెళ్లబెట్టి చూసే అంశం లేకపోవడం దీనికి మైనస్సే. కానీ అంచనాల కళ్లజోడు తీసేసి చూస్తే ‘హిట్-2’ ఒక డీసెంట్ థ్రిల్లర్ అని మాత్రం చెప్పొచ్చు.

- Advertisement -

విలన్ పాత్రను చాలా బలంగా చూపించడం సినిమాకు ప్లస్. దాని వల్ల హీరో పాత్ర కూడా బాగానే ఎలివేట్ అయింది. కానీ అంత బలంగా చూపించిన విలన్ విషయంలో ఒక హైప్ తో ఉంటాం. కానీ విలన్ ముసుగు తీసేశాక.. ఆ కిల్లర్ ఎవరు అని చూశాక ఓస్ ఇతనా అన్న ఫీలింగ్ కలుగుతుంది. అడివి శేష్ ముందు అతను బలహీనంగా కనిపిస్తాడు. కిల్లర్ అంటే ఇలా ఉండాలి అనే రూల్ ఏమీ లేదు కానీ.. మనం తెరపై చూసే నటుడు.. ఆ పాత్ర అంత ఎగ్జైటింగ్ గా మాత్రం కనిపించవు. ఇక విలన్ బ్యాక్ స్టోరీ.. హత్యలు చేయడం వెనుక ఉన్న కారణం కూడా అంత బలంగా లేవు. అందరినీ ఒక గాటన కట్టి చంపేయడంలో లాజిక్ కనిపించదు. హత్యల వెనుక కారణాన్ని ఇంకా బలంగా.. కన్విన్సింగ్ గా చూపించే ప్రయత్నం చేయాల్సింది. ఒక థ్రిల్లర్ సినిమాకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలన్నీ ‘హిట్-2’లో ఉన్నా.. ఇది పర్ఫెక్ట్ థ్రిల్లర్ అనిపించకపోవడానికి తగ్గ కారణాలు కూడా కొన్ని ఉన్నాయి.

నటీనటుల నటన..హిట్ లో హీరో విశ్వక్సేన్ పాత్రతో పోలిస్తే.. ఇందులో అడివి శేష్ భిన్నంగా కనిపిస్తాడు. మామూలు పోలీసాఫీసర్లలా కాకుండా కొంచెం నిర్లక్ష్య ధోరణితో.. యాటిట్యూడ్ తో కనిపించే క్యారెక్టర్లో శేష్ చక్కటి పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ‘మేజర్’లో సీరియస్ సోల్జర్ పాత్రలో చూశాక.. ఇందులో అతణ్ని చూస్తే చాలా భిన్నంగా అనిపిస్తుంది. శేష్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. లుక్స్ పరంగా ఎప్పట్లాగే ఆకట్టుకున్నాడు. సినిమా ఆరంభంలో అంత కాన్ఫిడెన్స్ చూపించి.. విలన్ ముప్పుతిప్పలు పెట్టాక నిస్సహాయంగా కనిపించే సీన్లలోనూ అతను మెప్పించాడు. కొన్ని చోట్ల బిగి తగ్గినా శేష్ తన ఎనర్జీతో సినిమాను ముందుకు నడిపించాడు. హీరో ప్రేయసి పాత్రలో మీనాక్షి చౌదరి ఓకే అనిపించింది. తన పాత్ర పరిధి మేరకు ఆమె బాగానే నటించింది. కోమలి ప్రసాద్ మెప్పించింది. హీరో పై అధికారి పాత్రలో రావు రమేష్ పరిమిత సన్నివేశాల్లో తన ఉనికిని చాటుకున్నాడు. సుహాస్ ఓకే. తనికెళ్ల భరణి.. మిగతా నటీనటులంతా చిన్న చిన్న పాత్రల్లో బాగానే చేశారు.

సాంకేతిక..హిట్’ తరహాలోనే ‘హిట్-2’ను కూడా సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దింది టీం. జాన్ స్టీవర్ట్ ఏడూరి నేపథ్య సంగీతం కొన్ని చోట్ల మరీ లౌడ్ అనిపించినా.. చాలా వరకు సన్నివేశాల తీవ్రతకు తగ్గట్లుగా సాగి ఆకట్టుకుంటుంది. థ్రిల్లర్ సినిమాలకు తగ్గ మూడ్ ను క్యారీ చేయడంలో నేపథ్య సంగీతంతో పాటు మణికందన్ కెమెరా వర్క్ కీలక పాత్ర పోషించాయి. సినిమాలో ఉన్న ఒక్క పాట బాగుంది. నిర్మాణ విలువల విషయంలో నాని-ప్రశాంతి రాజీ పడలేదు. కథల ఎంపికలో అభిరుచి.. హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో వాల్ పోస్టర్ సినిమా ప్రమాణాలు మరోసారి కనిపిస్తాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ శైలేష్ కొలను క్రైమ్ థ్రిల్లర్లు తీయడంలో తన నైపుణ్యాన్ని మరోసారి చూపించాడు. కానీ అతడి కథలు ఒక ఫార్మాట్లో సాగిపోతుండడం వల్ల రెండు సినిమాలకే ఒక మొనాటనస్ ఫీలింగ్ వచ్చేస్తోంది. ఇక ఈ సినిమా గురించి ఫైనల్ గా చెప్పాలంటే సినిమా చూసే తీరుపై ఆధారపడి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement