‘‘ఎల్లప్పుడూ నేవీలో ఉండాలని కోరుకున్నా.. కానీ, నా 6/12 కంటిచూపు నన్ను అడ్డుకుంది. నావికాదళ దినోత్సవం సందర్భంగా భారత నావికాదళానికి శుభాకాంక్షలు.. నావికాదళం ఇది సరైన ప్రదేశమని నొక్కిచెప్పిన రోజు.. కరాచీలోని శత్రు భూభాగంలోకి పోరాటాన్ని తీసుకెళ్లింది.. సముద్రాలను పాలించేవాడు ప్రపంచాన్ని పరిపాలిస్తాడు’’! అని శౌర్య చక్ర అవార్డు గ్రహీత, కల్నల్ డీపీకే పిళ్లై ట్వీట్ చేశారు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్‌ని మరిచిపోలేమన్నారు. అసలు 1971 డిసెంబర్ 4న ఏం జరిగిందంటే…
పాకిస్తాన్‌కు చెందిన కరాచీ నౌకాశ్రయంపై భారత నేవీ ‘ఆపరేషన్ ట్రైడెంట్’ ను 1971లో సరిగ్గా ఇదే రోజున ప్రారంభించింది. వరుస బాంబులతో నౌకాశ్రయాన్ని భారత నౌకాదళ సిబ్బంది వణికించారు. భారత్-పాక్ మధ్య వార్ ప్రారంభమైన మరుసటి రోజునే రంగంలోకి దిగిన భారత నౌకాదళం తన ప్రతాపాన్ని చూపడంతో వారం రోజుల పాటు కరాచీ నౌకాశ్రయంలో మంటలు కొనసాగాయి. పాకిస్తాన్ వైపు నుంచి దాడులు జరిగే అవకాశాలు ఉంటాయని ముందే ఊహించిన అప్పటి నేవీ చీఫ్ అడ్మిరల్ ఎస్‌ఎం నందా.. కరాచీ నౌకాశ్రయంపై దాడులకు దిగడం వల్ల ప్రభుత్వానికి ఏదైనా రాజకీయపరమైన అభ్యంతరాలు కలుగుతాయా? అని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని అడిగారట. దానికి సమాధానంగా ఇందిరమ్మ.. ‘యుద్ధమంటే యుద్ధమే.. పోరు జరిగినట్లయితే పోరు ఉంటుంది’ అని తన గ్రీన్ సిగ్నల్‌ను చెప్పకనే చెప్పారట.
ఇండియా, పాక్ వార్ మొదలైన మరుసటి రోజున అంటే డిసెంబర్ 4వ తేదీన భారత నేవీ ‘ఆపరేషన్ ట్రైడెంట్’ ను ప్రారంభించింది. పాకిస్తాన్‌కు ప్రధాన యుద్ధ వనరుగా నిలిచిన కరాచీ పోర్ట్‌పై వరుస బాంబులతో దాడికి దిగిడంతో ఎక్కడ చూసినా అగ్నికీలలే దర్శనమిచ్చాయి. పాకిస్తాన్ ఇలాంటి పనులకు పాల్పడుతుందని ముందుగానే గ్రహించిన భారత నౌకాదళం.. ఆ మేరకు ఎదుర్కొనేందుకు సంసిద్ధమైంది. ఐఎన్‌ఎస్ నిపట్, ఐఎన్‌ఎస్ వీర్, ఐఎన్‌ఎస్ నిర్ఘాట్‌తో పాటు ఐఎన్‌ఎస్ కిల్టన్ ముంబైలోని వెస్ట్రన్ ఫ్లీట్ నుంచి రెండో తేదీన కదనరంగంలోకి దూకాయి. కరాచీ నౌకాశ్రయంలో యుద్ధం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న పీఎన్‌ఎస్ ఖైబర్‌పై రాత్రి 10.40 వేళ ఐఎన్‌ఎస్ నిర్ఘాట్ తొలి శతఘ్నితో విరుచుకుపడింది.
దాంతో పీఎన్‌ఎస్ ఖైబర్ నీటిలో మునిగిపోయి దాదాపు 222 మంది చనిపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. అనంతరం అక్కడే ఉన్న ఎంవీ వీనస్ ఛాలెంజర్, పీఎన్‌ఎస్ షాజహాన్‌పై భారత్‌కు చెందిన ఐఎన్‌ఎస్ నిపట్ మిస్సైళ్లతో దాడులకు పాల్పడటంతో అక్కడ మంటలు మిన్నంటుకున్నాయి.