న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశరాజధాని ఢిల్లీలోని పురానా ఖిల్లాలో భారత పురావస్తు శాఖ (ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో చేపట్టిన తవ్వకాల్లో 2,500 ఏళ్ల నాటి అవశేషాలు బయటపడ్డాయి. మౌర్యుల కాలానికి ముందు నుంచి 9 సాంస్కృతిక తరాలకు సంబంధించిన ఆనవాళ్లు దొరికినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం పురానా ఖిల్లాలో జరుగుతున్న తవ్వకాల పనులను కేంద్రమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా తమ తవ్వకాల్లో బయటపడిన అంశాలను కేంద్రమంత్రికి అధికారులు వివరించారు.
అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పురానా ఖిల్లా ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని ‘ఇంద్రప్రస్థ సైట్’ గా గుర్తించినట్లు వెల్లడించారు. మౌర్యులకు ముందు, మౌర్యుల కాలం, సుంగులు, కుషాణులు, గుప్తులు, గుప్తుల తర్వాత, రాజ్‌పుత్‌లు, సుల్తానులు, మొఘలుల కాలం వరకు 9 వరుసలుగా ఆనవాళ్లు లభించాయన్నారు. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ప్రాంతంలో బయటపడ్డ చారిత్రక అవశేషాల రూపంలో మౌర్యులకు ముందు కాలం నుంచి.. మొఘలుల వరకు చరిత్ర బహిర్గతమైన ఏకైక ప్రాంతం ఇదేనని కేంద్రమంత్రి వెల్లడించారు. ఈ తవ్వకాల్లో వైకుంఠ విష్ణు రాతి విగ్రహం, గజలక్ష్మి టెర్రాకోట విగ్రహం, వినాయకుడి రాతి విగ్రహం, సీల్స్ (ముద్రలు), సీలింగ్స్, నాణాలు, మనుషులు & జంతువుల టెర్రాకోట బొమ్మలు, రాతితో రూపొందించిన బెడ్స్, ఎముకలతో చేసిన సూదులు మొదలైనవి లభించాయన్నారు.
‘ఇంద్రప్రస్థ సైట్’లో 2,500 ఏళ్ల క్రితం నాటి మానవ నివాస ప్రాంతాలు, జీవన అస్తిత్వానికి సంబంధించిన ఆనవాళ్లు స్పష్టంగా కనబడుతున్నాయి. తవ్వి తీసిన చేసిన ఓ చిన్న ప్రాంతం నుంచి 136కు పైగా నాణాలు, 35 ముద్రలు, సీలింగ్స్ లభించడం ద్వారా.. ఆ ప్రాంతం వ్యాపార, వాణిజ్యానికి ముఖ్యమైన కేంద్రంగా అర్థమవుతోందన్నారు. ఇక్కడ బయటపడిన వస్తువులన్నింటినీ మ్యూజియంలో భద్రపరుస్తామని, వీటిని పెట్టి సందర్శకులు చూసేందుకు అనుమతిస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు.
1955 నుంచే ఈ ప్రాంతంలో భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో తవ్వకాలు ప్రారంభమయ్యాయని, ఆ తర్వాత 1969-73 మధ్య పద్మశ్రీ ప్రొఫెసర్ బీబీ లాల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎక్స్‌కవేషన్స్ జరిగాయని వెల్లడించారు. 2013-14, 2017-18 మధ్యలో పురావస్తు శాఖకు చెందిన డాక్టర్ వసంత్ కుమార్ స్వర్ణ్‌కార్ ఆధ్వర్యంలో తవ్వకాలు జరిగాయన్నారు. ఈ సైట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ గుట్ట మధ్య ప్రాంతంలో 2023 జనవరి నుంచి తాజా తవ్వకాల ప్రక్రియ ప్రారంభమైందని, అప్పటినుంచి 5.5 మీటర్ల లోతు వరకు తవ్వకాలు చేపట్టినట్లు కేంద్రమంత్రి తెలిపారు. 2023 సెప్టెంబర్ లో ఢిల్లీలో జరగనున్న జీ20 హెడ్స్ ఆఫ్ స్టేట్స్ సమావేశాల సందర్భంగా డెలిగేట్స్‌కు పురానా ఖిల్లా లోని ఈ తవ్వకాల ప్రాంతాన్ని సందర్శన ఏర్పాటుచేసేలా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విన్నవిస్తానని కిషన్ రెడ్డి వెల్లడించారు.