హిందూత్వ విధానాలతో దేశంలో కక్షలు రగులుతున్నాయని, మరోవైపు ఎన్నికల కోసం దేశాన్ని మోడీ ఆగమాగం చేస్తున్నారని మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను, చరిత్రను కూడా మార్చేస్తోందని, అణగారిన వర్గాల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. వారు (బీజేపీ) ప్రతిదీ నాశనం చేస్తున్నారు. చరిత్ర మారిపోయింది. దళితులు, ఆదివాసీలు హింసకు గురవుతున్నారు. అసలు హిందూ మతాన్ని మరిచిపోతున్నారు… కానీ, ఎన్నికలు రాగానే ఆయన (పీఎం మోడీ) సాధువులా మారిపోతారు. ఒక సంతులాగా పోజులిస్తాడు. అని మమతా విమర్శలు చేశారు.
ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతిని తొలగించి నేతాజీ హోలోగ్రామ్‌ను పెట్టారు. ఇప్పుడు ఆ హోలోగ్రామ్ కూడా లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వారికి ఐకాన్‌ల పేర్లను గుర్తుకొస్తాయి అని ఇండియా గేట్ వద్ద ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఏర్పాటుపై ధ్వజమెత్తారు. స్వాతంత్ర్య సమరయోధుడి జయంతి సందర్భంగా ఇండియా గేట్ వద్ద సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. అదే స్థలంలో ఏర్పాటు చేయాల్సిన గ్రానైట్ విగ్రహం పూర్తయ్యే దాకా హోలోగ్రామ్ ప్లేస్‌హోల్డర్‌గా పని చేస్తుందని ప్రకటించారన్నారు.
కొవిడ్ 10 మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మమతా బెనర్జీ. పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళాలుగా వచ్చిన కోట్లాది రూపాయలను ఏం చేశారని ప్రశ్నించారు మమత. కోట్లాది మంది కరోనాతో బాధపడుతున్నారు. లక్షలాది మంది చనిపోయారు. మీకు అసలు సిగ్గు అనేది ఉందా.. అన్ని కోట్ల పీఎం కేర్స్ ఫండ్ అంతా ఏమయ్యింది. పేదలను ఆదుకోని ప్రభుత్వం ఎందుకు..? అని నిలదీశారు మమత. జనాలను ఆదుకోని ఈ ప్రధాని ప్రజలకు జారీ చేసే కొవిడ్టీకాల సర్టిఫికెట్లో మాత్రం తన పొటోను పెట్టుకుంటారని ఇంజెక్షన్‌పై మోడీ ఫొటోను చూపిస్తూ ఆ డబ్బు ఎవరిది అని ప్రశ్నించారు.
యూపీలో బీజీపీ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల..
యూపీలో బీజేపీ ప్రభుత్వం అక్కడి ప్రజలకు చెప్పేదంతా అబద్ధమేనన్నారు మమతా బెనర్జీ. ‘‘నేను ఎన్నకల ప్రచారంలో భాగంగా యూపీకి వెళ్లాను. అక్కడ బీజేపీ వాళ్లు 42లక్షల ఇళ్లు కట్టించామని ప్రచారం చేయడం చూశాను. మీ జనాభా ఎంత అని నేను కొంతమందిని అడిగాను. 24 కోట్లు అని చెప్పారు. మరి బెంగాల్‌లో 11 కోట్ల జనాభా ఉంది. మేము అంతకంటే ఎక్కువ ఇండ్లు నిర్మించాం. కానీ, అక్కడ వాళ్లు చెప్పేదంతా అబద్ధమే’’ అని మమత ఆరోపించారు. మరోవైపు.. బెంగాల్‌లోని టీఎంసీ ప్రభుత్వం పౌరులకే కాకుండా శరణార్థులకు కూడా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందని ముఖ్యమంత్రి మమత నొక్కి చెప్పారు.‘‘నా జీవితంలో శరణార్థుల కోసం ఎన్నో ఆందోళనలు చేశాను. వారికి ఇచ్చిన హామీ ప్రకారం… గతేడాది 7వేలకు పైగా భూ పట్టాలు పంపిణీ చేశాం. ఎవరూ వెళ్లిపోవాల్సిన అవసరం లేదు. మతువా కూడా దీని కిందకే వస్తుంది. మొత్తం 261 శరణార్థుల కాలనీలు ఆమోదించాం ”అని మమతా చెప్పారు.