అసోం రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గువాహటిలోని శ్రీమంత శంకర్ దేవా కళాక్షేత్రలో గవర్నర్ జగదీశ్ ముఖి.. హిమంతతో ప్రమాణం చేయించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణం ఈ కార్యక్రమం జరగనుంది. ఆయనతో పాటు కేబినెట్ మంత్రులు కూడా నేడే ప్రమాణస్వీకారం చేస్తారు. అయితే వారి పేర్లను ఇంకా ప్రకటించలేదు.
గత వారం రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ గువాహటిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో హిమంతను బీజేపీ శాసనసభా పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం హిమంత రాజ్ భవన్ వెళ్లి అసోం గవర్నర్ జగదీశ్ ముఖిని కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మద్దతు తనకు ఉందని బీజేపీ, ఏజీపీ, యూపీపీఎల్ ఎమ్మేల్యేలు సంతకాలు చేసిన లేఖను సమర్పించారు. అనంతరం హిమంతను ముఖ్యమంత్రిగా నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు.
మొత్తం 126 స్థానాలు ఉన్న అసోం అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 75 స్థానాల్లో విజయం సాధించింది. కూటమిలోని బీజేపీ 60 స్థానాలు, ఏజీపీ 9, యూపీపీఎల్ 6 సీట్లు గెలుపొందాయి. అసోం కొత్త సీఎం హిమంత బిశ్వశర్మ ఆరేళ్ల కిందట కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
కాగా, అసోం సీఎం పీఠం హిమంత బిశ్వశర్మకు దక్కడం వెనుక చాలా డ్రామా నడిచింది. శర్బానంద సోనోవాల్, బిశ్వశర్మ ఢిల్లీ వెళ్లి ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా, అమిత్ షాలతో వేర్వేరుగానూ, ఇద్దరూ కలిసి పలు పర్యాయాలు భేటీ అయ్యారు. సీఎం పీఠం తనకే ఇవ్వాలంటూ హిమంత పట్టుబట్టిన నేపథ్యంలో అధిష్ఠానం ఆయనవైపే మొగ్గుచూపింది.
ఇది కూడా చదవండి: ఈటల విధేయులే టార్గెట్… ఎంపీ రంజిత్ రెడ్డిపై టీఆర్ఎస్ గురి!