Friday, November 22, 2024

‘హిజాబ్​’ సున్నితమైన అంశం.. తొందరపాటు చర్యలు వద్దు: సీజేఐ ఎన్వీ రమణ

కర్నాటకలో వివాదాస్పదంగా మారిన హిజాబ్ కేసును సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించే ముందు కర్నాటక హైకోర్టు తప్పనిసరిగా విచారణ జరపాలని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. మతపరమైన అంశం కాబట్టి ఈ కేసును బదిలీ చేయాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును ఆశ్రయించడంతో సీజేఐ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. హిజాబ్​ వివాదం మత కల్లోలాలకు దారితీస్తోందని, ఈ అంశంపై జరుగుతున్న ఆందోళనలతో స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయన్నారు అడ్వొకేట్​ కపిల్​ సిబల్​. చాలా చోట్ల ఆడపిల్లలను రాళ్లతో కొడుతున్నారని.. అందుకని ఈ సమస్యను సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకోవడం అవసరం అన్నారు. ‘‘హిజాబ్​ రో’’ అనేది ఇప్పుడు మొత్తం దేశానికి విస్తరిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పరీక్షలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. హిజాబ్​ విషయమై విచారణ జరపాలని ఈ రోజు ఉదయం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాం. ఈ విషయం తొమ్మిది మంది న్యాయమూర్తుల ముందుకు వెళ్లాలి. నేను ఈ కోర్టును విచారణ చేయాలని రిక్వెస్ట్​ చేస్తున్నా అన్నారు కపిల్​ సిబల్​. దీనిపై సీజేఐ ఎన్వీ రమణ బదులిస్తూ..

‘‘ముందుగా ఈ విషయాన్ని హైకోర్టు విచారణ చేపట్టనివ్వండి. ఈరోజు అది ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ముందుకు కేసు వచ్చింది. ఈ దశలో మేము దానిని చేపట్టడం చాలా తొందరపాటు అవుతుంది. హైకోర్టు ఇచ్చే మధ్యంతర ఉత్వర్వులు ఏమిటో చూద్దాం’’ అని పేర్కొన్నారు.

కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రీతూ రాజ్ అవస్తీ స్వయంగా జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్,  జస్టిస్ జేఎం ఖాజీలతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఇవ్వాల కర్నాటక హిజాబ్ రో కేసును విచారణ జరపనుంది. బాగల్‌కోట్‌లో నిరసనలు హింసాత్మకంగా మారిన తర్వాత..  హిజాబ్- వర్సెస్ శాఫ్రాన్​ కండువాలతో నిరసనలు పెరగడంతో శివమొగ్గలో సెక్షన్ 144  విధించారు. ఈ క్రమంలో పరిస్థితులు విషమిస్తున్న నేపథ్యంలో కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై పాఠశాలలు, కళాశాలలను 3 రోజుల పాటు మూసివేయాలని ఆదేశించారు.

కాగా, హిజాబ్ ధరించినందుకు ఆరుగురు ముస్లిం బాలికలను తరగతులకు హాజరుకాకుండా కర్నాటకలోని కోస్టల్ టౌన్ ఉడిపిలోని ప్రభుత్వ ప్రీ -యూనివర్శిటీ కళాశాల యాజమాన్యం నిషేధించడంతో జనవరి 1వ తేదీ నుంచి కర్నాటక రాష్ట్రంలో హిజాబ్ గొడవ ప్రారంభమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement