Tuesday, November 26, 2024

Spl Story: హైటెన్షన్​ టూర్​.. మహా మొండి సీఎం కేసీఆర్, నక్సల్స్​ ఏరియాలో రోడ్​ జర్నీ!

ములుగు ఏజెన్సీ.. అదొక కీకారణ్యం. అడవి మల్లంపల్లి నుంచి మొదలై.. అటు గోదావరి ఆవల ఉన్న వాజేడు వెంకటాపురం, తెలంగాణ–ఛత్తీస్​గఢ్​ బోర్డర్​ దాకా ఉన్న అతిపెద్ద అటవీ విస్తీర్ణం ములుగు జిల్లా సొంతం. ఇట్లాంటి కాకులుదూరని కారడవిలో ఇవ్వాల (ఆదివారం) తెలంగాణ సీఎం కేసీఆర్​ సాహస యాత్ర చేశారు. ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రులు చేయని విధంగా రోడ్​ మార్గంలో హనుమకొండ నుంచి భద్రాచలం దాకా దాదాపు 230 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం రికార్డుగానే చెప్పుకోవాలి.  

– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ

ములుగు–తాడ్వాయి అభయారణ్యం ఇదో వన్యమృగ సంరక్షణా కేంద్రంగా విరాజిల్లుతోంది.  అంతేకాకుండా టైగర్​ రిజర్వ్​ జోన్​గానూ గుర్తింపుపొందింది. ఇక్కడి నుంచి ఏటూరునాగారం వరకు ఎక్కడా గ్యాప్​ లేకుండా పెద్ద ఎత్తున అటవీ విస్తీర్ణం ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా నక్సల్స్​కు సేఫ్​ జోన్​గా ఉండేది. ఇక్కడి నుంచి మొదలై ఛత్తీస్​గఢ్​ దండకారణ్యం దాకా మావోయిస్టుల కార్యకలాపాలు ఎక్కువే. దీన్నంతా మావోయిస్టుల కారిడార్​గా పిలుచుకునేవారు.

అంతేకాకుండా నేపాల్ మావోయిస్టులతో ఇక్కడి పీపుల్స్​వార్​కి ఈ కారిడార్​ నుంచే రాకపోకలు సాగేవని సమాచారం. అప్పటి  పీపుల్స్​వార్​తో పాటు ఈ ప్రాంతంలో లోకల్​ నక్సల్స్​ గ్రూపుల ప్రాబల్యం పెద్ద ఎత్తున ఉండేది. దీంతో గ్రామాల్లో ఒకవైపు నక్సల్స్​ సంచారం.. మరోవైపు పోలీసుల బూట్ల చప్పుళ్లు మారుమోగేవి. అటు అన్నల జాడ చెప్పమని పోలీసులు, ఇటు ఇన్​ఫార్మర్ల నెపంతో నక్సల్స్​ యువతను టార్చర్​ పెట్టేది. అంతేకాకుండా రోజుకో చోట ఎన్​కౌంటర్​, ఎదురుకాల్పుల వంటి వార్తలు ఈ ఏరియా నుంచే ఎక్కువగా వస్తుండేవి. జనశక్తి, ప్రతిఘటన, ప్రజాప్రతిఘటన గ్రూపుల యాక్టివిటీస్​ ఎక్కువగా ఉండే ఇట్లాంటి ఏరియాలో ఇప్పుడు సీఎం కేసీఆర్​ పర్యటన చేయడం పోలీసులకు సవాల్​గా మారిందని చెప్పవచ్చు.

ఏ సీఎం చేయని విధంగా ఏజెన్సీలో కేసీఆర్​ జర్నీ..

- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో పనిచేసిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా ములుగు ఏజెన్సీకి రావాలంటే భయపడేవారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా నక్సల్స్​ యాక్టివిటీస్​ దానికి కారణం. లోకల్​గా ఉండే లీడర్లు కానీ, ప్రజాప్రతినిధులు కానీ పోలీస్​ ఫోర్స్​ లేకుండా జర్నీ చేయడం కూడా చాలా అరుదుగా ఉండేది. ఒకప్పుడు ఏటూరునాగారం  ఐటీడీఏ సమావేశం ముగించుకుని వరంగల్​ తిరుగు ప్రయాణమైన అప్పటి కలెక్టర్​ ఆదిత్యనాథ్​ దాస్​పై పీపుల్స్​వార్​ అటాక్​ చేసిన ఘటన ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదు. అడుగడుగానా ల్యాండ్​ మైన్స్​తో ఉండే ములుగు ఏజెన్సీ అంటే అధికారులకు కూడా కింది నుంచి మొదలైన వణుకు నిలువెల్లా పాకుతుంది. అట్లాంటి ఏరియాలో ఎట్లాంటి ముందస్తు ప్లాన్​ లేకుండా సీఎం కేసీఆర్​ రోడ్డుమార్గంలో వెళ్లడం అనే విషయాన్ని అతిపెద్ద సాహస యాత్రగా చెబుతున్నారు పొలిటికల్​ అనలిస్టులు.

నక్సల్స్​ సేఫ్​ జోన్​లో 220 కి.మీ జర్నీ..

హనుమకొండ నుంచి భద్రాచలం వెళ్లాలంటే తప్పకుండా అటవీ మార్గమే దిక్కు. కానీ, సీఎం కేసీఆర్​ అనుకున్న ఏరియల్​ సర్వే ప్లాన్​ బ్యాడ్​ వెదర్​ కారణంగా రద్దయ్యింది. హెలిక్యాప్టర్​ జర్నీకి వాతావరణం అనుకూలించక పోవడంతో అధికారులు వద్దని చెప్పారు. అంతేకాకుండా కొంతమంది అధికారులైతే పర్యటన వాయిదా వేసుకుని ఆ తర్వాత వెళ్లవచ్చని చెప్పినా సీఎం కేసీఆర్​ వినిపించుకోలేదని తెలుస్తోంది. ఎట్లయినా సరే గోదావరి వరద బాధితులను కలుసుకుని వారి సాదక బాదకాలను స్వయంగా తెలుసుకోవాలన్న మొండిపట్టుతోనే సీఎం కేసీఆర్​ రోడ్డు మార్గాన వెళ్లాలని అప్పటికప్పుడు డిసైడ్​ అయినట్టు సమాచారం. ఈ క్రమంలో కొంతమంది పోలీసు అధికారులు ఎంత వద్దని చెప్పినా కూడా ముందుకు సాగినట్టు తెలుస్తోంది.

ఒకవైపు వర్షం, మరోవైపు నక్సల్స్​ ప్రభావిత ఏజెన్సీ.. ఇట్లాంటి కఠినమైన పరిస్థితుల్లో పోలీసులు కూడా టెన్షన్​పడ్డారు. నిన్న మంత్రి సత్యవతి రాథోడ్​ దండకారణ్యంలోని పలిమెల తదితర ఇంటీరియల్​ మండలాల్లో పర్యటించారు. ఆ పర్యటనకు సెక్యూరిటీ కల్పించిన పోలీసులు ఇవ్వాల అనూహ్యంగా  సీఎం  కేసీఆర్​ రోడ్డు మార్గాన వెళ్లడంతో మరింత హైటెన్షన్​కి గురయ్యారు.​ తీవ్ర నక్సలైట్ ప్రభావిత ప్రాంతం ములుగు– ఏటూర్ నాగారం– మంగపేట– ఏడూళ్ల బయ్యారం – మణుగూర్ – అశ్వాపురం – సారపాక మీదిగా సీఎం కేసీఆర్​ భద్రాచలం చెరుకున్నారు.  

ఇంతకుముందు కూడా ఇట్లానే..

అయితే.. ఇంతకుముందు కూడా సీఎం కేసీఆర్​ ఇట్లాంటి సాహసాలు చేశారని తెలుస్తోంది. 2015లో కూడా దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా సీఎం కేసీఆర్ భద్రాచలం నుంచి వరంగల్‌కు వచ్చారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో మార్చి29న జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్న తర్వాత మణుగూరు మీదుగా ముఖ్యమంత్రి వాహనశ్రేణి రోడ్డు మార్గం లో వరంగల్ జిల్లాకు చేరింది. అప్పుడు మణుగూరు నుంచి మహబూబాబాద్, నర్సంపేట మీదుగా వరంగల్‌కు వెళ్లాలని ముందుగా అధికారులు రోడ్‌మ్యాప్ నిర్ణయించారు. అయితే.. లాస్ట్​ మినిట్​లో ఈ రూట్ మారింది.

కేసీఆర్ వాహనశ్రేణి మణుగూరు నుంచి బయలుదేరగానే మణుగూరు-మంగపేట-ఏటూరునాగారం-వరంగల్ రహదారిలో దాదాపు 175 కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ప్రైవేటు వాహనాలను రోడ్డుపైకి రానివ్వలేదు. సీఎం కాన్వాయి ప్రధాన రహదారిపై వస్తున్న క్రమంలో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, శ్రేణులు కాన్వాయ్‌ను ఆపేందుకు ప్రయత్నించగా, పోలీసులు అనుమతించలేదు. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా పేరుగాంచిన ఏటూరునాగారం, ములుగు ఏజెన్సీలో గంటా ఇరవై నిమిషాల పాటు ప్రయాణించి​ రికార్డు నెలకొల్పారు. ఆ రికార్డును ఇవ్వాల మళ్లీ తనకు తానే చెరిపేసి కొత్తగా రాశారు సీఎం కేసీఆర్​.

Advertisement

తాజా వార్తలు

Advertisement