హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్ర తలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. నిజామాబాద్, ఆదిలా బాద్, ఖమ్మం, నల్గొండ తదితర జిల్లాల్లో రికార్డుస్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమో దవుతున్నాయి. ఈ 7 జిల్లాల్లో 44 డిగ్రీల కన్నా ఎక్కువగా ఎండలు నమోదు కావ డం ఆందోళనకు గురిచేస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిని మించి నమో దవుతుండడంతో ఉదయం 10గంటలు దాటితే చాలు జనం బయటకు రావాలం టేనే జంకుతున్నారు. అత్యధికంగా నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో 44.8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లా కట్టంగూరు, ఆసీఫాబాద్ జిల్లా జంబుగల్లో 44.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 41 డిగ్రీలకన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కన్నా తక్కువగా ఉన్నా ఎండ వేడి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటోంది. ఇందుకు కారణం ఓజోను పొర కరుగుతుండడంతో సూర్యుడి నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాలు భూమి పైకి చేరడమేనని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఎండకు కాలిపోయిన కారు…
సాధరణంగా రోహిణి కార్తెలో రోకళ్లు పగిలేంత ఎండ కొడుతుందంటారు… అయితే రోకల్లు పగులుడేమోకాని హన్మకొండ జిల్లా కాకాజీ కాలనీలో ఎండల దాటికి ఓ కారు దగ్ధమైంది. చెల్పూరుకు చెందిన కొలుగూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి హన్మకొండకు వచ్చాడు. రోడ్డు పక్కన కారును పార్క్ చేసి ఆస్పత్రిలోకి వెళ్లి అరగంట తర్వాత వచ్చి చూసే సరికి కారులో మంటలు చెలరేగాయి. స్థానికులు నీళ్లతో మంటలను ఆర్పేసినా అప్పటికే కారు సగానికిపైగా కాలిపోయింది.
పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు…
రాష్ట్రంలో ఈ నెల 22 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
హైదరాబాద్‌లో వడగళ్ల వాన…
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. అఫ్జల్‌గంజ్, అబిడ్స్, సైదాబాద్, బండ్లగూడ, హిమాయత్ నగర్, ఎల్బీనగర్, నాంపల్లి, చార్మినార్, బాలాపూర్, యాకత్‌పుర, చాంద్రాయణగుట్ట, సరూర్‌నగర్, కోఠి తదితర ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. పలు చోట్ల భారీ ఈదురు గాలులు వీచాయి. భారీ వర్షానికి రోడ్లపై పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొద్ది రోజులుగా ఎండవేడి, ఉక్కపోతతో సతమతమవుతున్న నగరవాసులకు సోమవారం కురిసిన వర్షంతో ఉపశమనం కలిగింది.