ఏపీ ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గవర్నర్ బిశ్వభూషణ్ అన్నారు. ఏపీ వ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ప్రభుత్వం తరఫున గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మనబడి నాడు-నేడు కింద కొత్తగా స్కూళ్లు, కాలేజీలు అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారని కొనియాడారు. పేద విద్యార్థులకు బాసటగా అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నారని.. జగనన్న విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్ద పథకాల ద్వారా విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకూరుతోందని గవర్నర్ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తోందని గవర్నర్ ప్రసంగించారు. ఈ వేడుకల్లో సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషన్‌రాజు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..