తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలపై విచారణ కొనసాగుతుందని.. ఈ సమయంలో పరీక్ష ఎలా నిర్వహిస్తారంటూ కోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు కొందరు. వీటిపై జూన్ 5వ తేదీన విచారించిన హైకోర్టు.. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు అభ్యంతరం లేదని.. నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులు పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఇప్పటికే లక్షా 20 వేల మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది హైకోర్టు.
నాడు గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులకు మరోసారి ఈ నెల 11వ తేదీన పరీక్ష నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ హాల్ టికెట్లు కూడా విడుదల చేసింది. జూన్ 11న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. కాగా, 503 గ్రూప్-1 పోస్టులకు మొత్తం 3,80,202 దరఖాస్తు లొచ్చాయి.