ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపు వివాదాలపై హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఉత్తర్వులను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఐఏఎస్‌లు సోమేష్ కుమార్, హరికిరణ్, అనంత రాములు, మల్లెల ప్రశాంతి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్, రొనాల్డ్ రాస్, శ్రీజన, శివశంకర్ గతంలో క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎస్‌లు అంజనీ కుమార్, అభిలాష బిస్త్, సంతోష్ మెహ్రా, ఏవీ రంగనాథ్, అభిషేక్ మహంతి కేటాయింపులపైనా గతంలో క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది.
అభిషేక్ మహంతి మినహా 13 మంది క్యాట్ ఉత్తర్వులతో కోరుకున్న చోట విధుల్లో ఉన్నారని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. అభిషేక్ మహంతిని మాత్రమే తెలంగాణ ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవడం లేదని ఏపీ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అభిషేక్ మహంతి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై క్యాట్ విచారణ చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టులో విచారణ పెండింగులో ఉందని క్యాట్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వానికి సూచించింది. ఐఏఎస్, ఐపీఎస్‌ల విభజన వివాదాలపై విచారణ మార్చి 24కి వాయిదా వేసింది.