గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండగా 1818వ సంవత్సరం నాటి 30రాగి నాణేలు బయటపడ్డాయి. వాటిని అమ్మడానికి వెళ్తున్న వ్యక్తులని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ తవ్వకాల్లో పెద్ద ఎత్తున బంగారు నాణేలు దొరికాయని గీసుకొండకు చెందిన ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటోన్న ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వారి మాటల ప్రకారం డిసెంబర్ 24న గుప్తనిధులు గుర్తించి బయటకు తీశారు. అందరూ సమానంగా పంచుకోవాలనుకున్నారు. అయితే అందులో నలుగురు మిగతా వారి కళ్లు కప్పి బంగారం మాయం చేశారు. ఇందులో సుమారు 140 కిలోల నుంచి మూడు క్వింటాళ్ల వరకు బంగారం ఉండి ఉంటుందని వారు సంభాషించుకున్నారు. గుప్త నిధులను బయటకు తీసేందుకు కోడెను బలిచ్చేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. అయితే రాగి నాణేలు మాత్రమే దొరికాయని పోలీసులు చెబుతున్నారు.
గంగదేవిపల్లిలో యార మల్లారెడ్డి జరిపిన తవ్వకాల్లో పెద్ద ఎత్తున బంగారం లభ్యమైనట్లు గ్రామస్తుల మధ్య చర్చ జరుగుతోంది. రాగి నాణేలతో పాటు దాదాపు వెయ్యి బంగారు నాణాలు లభ్యమైన విషయం వారం రోజుల క్రితం గ్రామస్తులకు తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే విషయం బయటకు తెలిస్తే అసలుకే మోసం వస్తుందనే ఉద్దేశంతోనే బంగారం విషయం వెలుగులోకి రాకుండా రాగి నాణేలు దొరికినట్లుగా సీన్ క్రియేట్ చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు. గంగాదేవి పల్లిలో జరిగిన గుప్తనిధుల తవ్వకాల్లో భారీ ఎత్తున బంగారం లభ్యమైన విషయం ఇద్దరు పెద్ద నేతలకు తెలియడంతో.. విషయం ఆరా తీసి వాటాలు కోరుతున్నట్లుగా నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. కేసును నీరుగార్చేందుకు, నిందితులను ఈ కేసు నుంచి రక్షించేందుకు బేరసారాలు జరుగుతున్నట్లుగా సమాచారం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..