యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన తాజా చిత్రం ఊర్వశివో రాక్షసివో . అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటించింది.సినిమా ఎలా వుందో రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
కథ ఏంటంటే.. శ్రీ (అల్లు శిరీష్) మధ్య తరగతి కుర్రాడు. చదువు పూర్తి చేసుకుని సాఫ్ట్ వేర్ ఉద్యోగం తెచ్చుకున్న అతను సింధు (అను ఇమ్మాన్యుయెల్)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి తన ఆఫీసులోనే కొలీగ్ అవుతుంది. ఆమెతో పరిచయం జరిగిన కొన్నాళ్లకు ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అనుకోకుండా ఒక రోజు ఇద్దరూ శారీరకంగా ఒక్కటవుతారు. దీంతో సింధుతో పెళ్లికి సిద్ధం అయిపోతాడు శ్రీ. కానీ ఆమె మాత్రం తనకు పెళ్లి ఇష్టం లేదని.. తన గోల్ వేరని చెబుతుంది. శ్రీ ఒత్తిడి చేయడంతో ముందు సహజీవనం చేసి.. ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం అంటుంది. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన శ్రీ అందుకు ఓకే అన్నాడా.. తర్వాత వీరి ప్రయాణం ఎక్కడిదాకా వెళ్లింది అన్నది మిగతా కథ.
విశ్లేషణ.. యూత్ ను టెంప్ట్ చేసే రొమాన్స్.. వాళ్లకు గిలిగింతలు పెట్టే కామెడీ డోస్ సరిపాళ్లలో కుదిరిన సినిమాగా ఊర్వశివో రాక్షసివోను చెప్పొచ్చు. ఒక మామూలు కథను ఎక్కడా బోర్ కొట్టని విధంగా ఎంటర్టైనింగ్ గా నరేట్ చేయడంతో ఇందులో టైంపాస్ వినోదానికి ఢోకా లేకపోయింది. నిజానికి ‘ఊర్వశివో రాక్షసివో’ ఒరిజినల్ మూవీ ఏమీ కాదు. ‘ప్యార్ ప్రేమ కాదల్’ అనే హిట్ మూవీకి రీమేక్. గీతా ఆర్ట్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేశారు కాబట్టి అక్కడితో పోలిస్తే ఈ సినిమా రేంజ్ పెరిగింది. అలా అని ఇందులో అడల్ట్ డోస్ ఏమీ తగ్గలేదు. సినిమా నిండా బోలెడన్ని ఇంటిమేట్ సీన్లున్నాయి. ఇక కామెడీలో అయితే డబుల్ మీనింగ్ డోస్ మామూలుగా లేదు. దీనికి తోడు లైట్ హార్టెడ్ హ్యూమర్ కూడా తోడవడంతో ఎక్కడా బోర్ అయితే కొట్టించదు ‘ఊర్వశివో రాక్షసివో’. ముఖ్యంగా యూత్ బాగా ఎంజాయ్ చేసే సీన్లు ఇందులో బోలెడున్నాయి.
నటీనటుల గురించి.. అమాయకమైన మధ్యతరగతి కుర్రాడి పాత్రలో అల్లు శిరీష్ ఆకట్టుకున్నాడు. కెరీర్ ఆరంభంలో మాదిరి కాకుండా ఇప్పుడు పాత్రకు యాప్ట్ అనిపిస్తున్నాడంటే శిరీష్ మెరుగైనట్లే చెప్పాలి. శ్రీ పాత్రలో మంచి ఈజ్ చూపించాడతను. ఎక్కడా కృత్రిమత్వం లేకుండా క్యారెక్టర్లో సహజంగా కనిపించాడు. అను ఇమ్మాన్యుయెల్.. ఫారిన్ రిటర్న్డ్ మోడర్న్ అమ్మాయిగా పాత్రకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. వ్యక్తిగత జీవితంలోనూ ఆమె నేపథ్యం అదే కావడంతో ఈ పాత్ర చేయడానికి పెద్దగా కష్టపడలేదు. కెరీర్లో ఇప్పటిదాకా ఏ సినిమాలో లేని రేంజిలో అందాల విందు చేయడమే కాక.. ఇంటిమేట్ సీన్లలో ఈజ్ చూపించింది. శిరీష్ తో ఆమె కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయింది. హీరో స్నేహితుడి పాత్రలో వెన్నెల కిషోర్ అదరగొట్టాడు. అతను కనిపించిన ప్రతిసారీ నవ్వులు పండాయి. సునీల్ బాగానే వినోదాన్ని పంచాడు. హీరో తల్లి పాత్రలో ఆమని ఆకట్టుకుంది. పృథ్వీ.. కేదార్ శంకర్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతికత.. అచ్చు రాజమణి-అనూప్ రూబెన్స్ కలిసి అందించిన పాటలు ఓకే అనిపిస్తాయి. సినిమా గమనానికి పాటలు బాగానే ఉపయోగపడ్డాయి. నేపథ్య సంగీతం బాగానే సాగింది. తన్వీర్ మీర్ ఛాయాగ్రహణం నీట్ గా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన మేర ఉన్నాయి. దర్శకుడు రాకేశ్ శశి రీమేక్ మూవీని బాగా డీల్ చేశాడు. తమిళంతో పోలిస్తే సినిమా తెలుగులో మరింత వినోదాత్మకంగా అనిపిస్తుంది. యూత్ ను టార్గెట్ చేసిన సీన్లు.. డైలాగుల విషయంలో రాకేశ్ ప్రతిభ చాటుకున్నాడు. ఇంకొంచెం అడల్ట్ డోస్ తగ్గించి ఉంటే.. ముగింపును షార్ప్ చేసి ఉంటే సినిమా స్థాయి పెరిగేది. అయినప్పటికీ దర్శకుడి పనితనానికి మంచి మార్కులే పడతాయి.ఓవరాల్ గా సినిమా బాగానే ఉందనే టాక్ వినిపిస్తోంది.