23 ఏళ్ల అనుభవ్ బర్న్వాల్ ది బిహార్‌లోని కతిహార్ గ్రామం. అతను ఉక్రెయిన్ లోని తూర్పు ఏరియాలో ఉన్న ఖార్కివ్‌లోని V N కరాజిన్ ఖార్కివ్ నేషనల్ యూనివర్శిటీలో MBBS చదువుతున్నాడు. ప్రస్తుతం అక్కడ యుద్ధం తీవ్రంగా సాగుతుండడంతో అక్కడే చిక్కుకుపోయాడు. విద్యార్థులు బయటకు వెళ్లడం కష్టం అవుతోంది. ఉక్రేనియన్ ప్రభుత్వం సిద్ధం చేసిన బంకర్లలో చాలా మంది తలదాచుకుంటున్నారు.
ఉక్రెయిన్‌లో MBBS చదవడం అతని ఫస్ట్ ఇంపార్టెన్స్ కాదు… నా సోదరుడు తన 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత భారతదేశంలోనే MBBS చేయాలనుకున్నాడు. 2-3 సార్లు నీట్ రాసి ప్రయత్నించాడు, కానీ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు పొందలేకపోయాడు .. అందుకే ఉక్రెయిన్‌లో చదువుకోవడానికి వెళ్లాడు.. అని అనుభవ్ అన్న అంకిత్ తెలిపాడు. ఖార్కివ్ నుండి తన సోదరుడి రాకకోసం ఇప్పుడు కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాడు. ఉక్రెయిన్, రష్యాలో ఉన్న ఆప్షన్లతో కంపేర్ చేస్తే భారతదేశంలో ఏదైనా ప్రైవేట్ కళాశాలలో అడ్మిషన్ ఎంతో ఖరీదైనది. ఇక్కడ MBBS చదువు పూర్తి చేయడానికి దాదాపు కోటి రూపాయలు కావాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ అంత పెద్ద మొత్తం ఖర్చు చేయడానికి స్థోమత లేక వేరే దేశాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోంది.
మొదటి హెచ్చరికలో విద్యార్థులు ఎందుకు వెనక్కి రాలేదు?
భారత ప్రభుత్వం హెచ్చరికలు చేసినా చాలా మంది విద్యార్థులు భారతదేశానికి ఎందుకు తిరిగి రాలేదని ప్రజలు అడుగుతున్నారు. ప్రాథమిక సలహాలు జారీ చేసినప్పుడు అక్కడ విమాన ప్రయాణం కష్టంగా మారింది. టికెట్ కొనాలంటే అంత పెద్ద మొత్తం పెట్టలేని పరిస్థితి ఉండేది. ‘‘మా సోదరుడు ఫిబ్రవరి 22న, ఆపై ఫిబ్రవరి 24న ఫ్లైట్‌ని బుక్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ, తక్కువ ధరకు టిక్కెట్లు లభించలేదు. అతను చివరకు ఫిబ్రవరి 26న రూ. 50 వేలు వెచ్చించి టికెట్ బుక్ చేసుకున్నాడు. అప్పటికి యుద్ధం మొదలైంది. దాంతో అక్కడే చిక్కుకుపోయాడు” అని అంకిత్ వివరించాడు. అంతేకాకుండా విశ్వవిద్యాలయాలు కూడా ఆన్లైన్ తరగతులను పునఃప్రారంభించటానికి అనుమతించ లేదు. ఆఫ్‌లైన్‌లోనే క్లాసులు ఉంటాయని తెలియజేయడం, ఆఖరి టర్మ్ పరీక్షలు కూడా ఉండడంతో విద్యార్థులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది’’ అని అంకిత్ తెలిపాడు.
భారతదేశంలో తక్కువ సీట్లు, ఖరీదైన MBBS
విదేశాల్లో కూడా ఎంబీబీఎస్ చదవాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఉక్రెయిన్ వంటి దేశాల్లో జీవన వ్యయాలతో ఐదారేళ్ల నుంచి ఆరేళ్లపాటు ఎంబీబీఎస్‌కు రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షలకు మించి ఖర్చు ఉండదు. భారతదేశంలో మేనేజ్మెంట్ కోటా సీటుకు రుసుము రూ. 30-70 లక్షలుగా నిర్ణయించారు. ఈ భారీ అంతరం వల్ల చాలా మంది ఔత్సాహిక విద్యార్థులు ఇక్కడ అంత పెద్ద మొత్తం ఖర్చు చేసి చదవలేక తక్కువ ఖర్చు అయ్యే విదేశాలకు వెళ్తున్నారు. అయినా .. తగినంత డబ్బు ఉన్నప్పటికీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో అడ్మిషన్లు పొందడం అంత ఈజీ కాదు. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో మేనేజ్మెంట్ కోటా కోసం 20,000 సీట్లు మాత్రమే రిజర్వ్ చేశారు. ఫీజులు విపరీతంగా ఉన్నాయి. MBBS కోర్సు పూర్తి చేయడానికి చాలా మంది రూ. 1 కోటి కంటే ఎక్కువ చెల్లించలేరు. 2014 తర్వాత, MBBS సీట్ల సంఖ్య రికార్డు స్థాయిలో 50,000 నుండి 93,000కి పెరిగింది. ఈ సంవత్సరం నాటికి ఈ సీట్లు దాదాపు 100,000కు పెరుగుతాయని ఆశిస్తున్నాము”అని NEGVAC అధిపతి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ వి కె పాల్ అన్నారు.